300 మంది.. 4 మరుగుదొడ్లు

14 Jun, 2020 10:05 IST|Sakshi

నగరపాలక  సంస్థలో మరుగుదొడ్లు కరువు

కార్యాలయంలో 300కు పైగా సిబ్బంది..

రోజుకు వెయ్యి మంది వరకు సందర్శన

ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ప్రజలు

సాక్షి, కరీంనగర్‌ : రాష్ట్రంలోనే పేరున్న నగరం. లక్షలమంది జనాభా. స్మార్ట్‌సిటీలో చోటు. ఆ దిశగా సాగుతున్న అభివృద్ధి పనులు. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో పనిచేసే ముఖ్య అధికారులు, సిబ్బంది 300కు పైగానే ఉంటారు. నిత్యం వెయ్యికి పైగా మంది ప్రజలు నగరపాలకకు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. ఉదయం 10 గంటలకు వచ్చిన సిబ్బంది సాయంత్రం ఇంటికి వెళ్తారు. పనుల నిమిత్తం వచ్చిన వారు ఒక్కోసారి రోజంతా ఇక్కడే గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒంటికి, రెంటికి ఇబ్బందులు తప్పడం లేదు. నగరపాలక సంస్థలో కేవలం నాలుగు మాత్రమే మరుగుదొడ్లు ఉండడంతో సిబ్బందికే సరిపోవడం లేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకున్న నాథుడే లేడు.

మూడువందలకు పైగా సిబ్బంది.. 
కరీంనగర్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్, మున్సిపల్‌ కమిషనర్లకు ప్రత్యేక చాంబర్లు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్, అదనపు కమిషనర్‌తో పాటు సుమారు 300 వందల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. 60మంది కార్పొరేటర్లు, వారి తరఫునవారు వస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం రోజుకు వెయ్యి మంది వరకు ప్రజలు వస్తుంటారు. దీంతో పాటు పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టర్లు వస్తుంటారు. వీరందరూ మరుగుదొడ్లకు ఇబ్బంది పడాల్సిందే. ఇంటికి వెళ్లే వరకు ఒంటికి, రెంటికి ఓపిక పట్టాల్సిందే. కార్పొరేషన్‌ కార్యాలయంలో ఎక్కడా టాయిలెట్స్‌ కనిపించవు. నాలుగు ఉన్నా.. రెండు సమావేశ మందిరం, మొదటి అంతస్తులో రెండు ఉన్నాయి. వీటినే అటు సిబ్బంది, ఇటు తెలిసిన ప్రజలు వినియోగిస్తున్నారు. ఒక్కో టాయిలెట్‌ను సుమారు 150 మంది చొప్పున వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో సిబ్బంది, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మహిళా సిబ్బంది తిప్పలు..
నగరపాలక సంస్థ కార్యాలయంలో 150 మందికిపైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా సుమారు 200మందికి పైగా మహిళలు కార్యాలయానికి వస్తుంటారు. వీరందరికి కలిపి కార్యాలయంలో ఉన్న టాయిలెట్స్‌ కేవలం రెండు మాత్రమే. అవి కూడా సమావేశం మందిరంలో ఉన్నాయి. ఏవైనా సమావేశాలు జరుగుతుంటే.. ఒక్కటే అందుబాటులో ఉంటుంది. దీంతో కార్పొరేషన్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజంతా నీళ్లు తాగడానికే భయపడుతున్న పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో సమీపంలో బస్టాండ్‌కు వెళ్లాల్సిన దుస్థితి. అక్కడ కూడా పేయిడ్‌ టాయిలెట్స్‌ ఉంటాయి. దగ్గర్లో ఉన్నవారు ఇంటికి సైతం వెళ్లిరావాల్సిన దుస్థితి అని మహిళా సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. మేయర్‌ దృష్టికి తీసుకువెళ్లినా.. పరిస్థితిలో మార్పు రాలేదు.

పట్టణంలో నిర్మించారు..కార్యాలయంలో మరిచారు..
కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 3లక్షలకు పైగా జనాభా ఉంది. నగరానికి ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా వస్తుంటారు. ప్రస్తుతం నగరంలో 17 సులభ్‌ కాంప్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మరో 28 నిర్మించడానికి  స్థలాలు గుర్తించారు. ఇవి కాకుండా స్మార్ట్‌సిటీలో భాగంగా మరో ఎనిమిది నిర్మించనున్నారు. కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. ఈనెల 11వ తేదీన ఎస్సారార్‌ కళాశాల వద్ద స్మార్ట్‌సిటీ టాయిలెల్స్‌ను మంత్రి గంగుల ప్రారంభించారు. ఆగస్టు 15నాటిని మరో 40నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే కార్పొరేషన్‌ కార్యాలయంలో మాత్రం ఒక్క నూతన టాయిలెట్‌ నిర్మించడానికి ఆలోచన చేయలేదు. స్థలం ఉన్నా.. ఆ దిశగా అడుగులు వేయలేదు. దీంతో నగరపాలక సిబ్బందికి, ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. 

మరిన్ని వార్తలు