‘పుర’లో మళ్లీ నామినేషన్‌ పనులు!

6 May, 2018 01:05 IST|Sakshi

మే నుంచి సెప్టెంబర్‌ వరకు అత్యవసర పనులు చేపట్టేందుకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో అత్యవసర పనులను నామినేషన్‌ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జీహెచ్‌ఎంసీలో రూ.25 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో రూ.10 లక్షలు, మునిసిపాలిటీల్లో రూ.5 లక్షలలోపు అంచనా వ్యయం కలిగిన ‘అత్యవసర’పనులను నామినేషన్‌ విధానంలో చేపట్టేందుకు ఆయా సంస్థల అధికారులకు ప్రత్యేకాధికారాలను కట్టబెట్టింది.

ఇటీవల రాష్ట్రంలో వడగండ్ల వాన సృష్టించిన బీభత్సం దృష్ట్యా ప్రస్తుత మే నుంచి వచ్చే సెప్టెంబర్‌ వరకు రాష్ట్రంలో కురిసే వర్షాలు, వడగండ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతినే రోడ్లు, మురుగు నీటి కాల్వలు, నాలాలకు అత్యవసర మరమ్మతుల నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రకృతి వైపరీత్యాల తర్వాత చేపట్టాల్సిన అత్యవసర పనులకే ఈ ప్రత్యేక అధికారాలను వినియోగించాలని, సెప్టెంబర్‌ 30 తర్వాత నామినేషన్ల విధానం కింద పనులకు పరిపాలనపర అనుమతులు జారీ చేయరాదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని పురపాలికల్లో నామినేషన్‌ పనులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, తాజా ఉత్తర్వుల ద్వారా తాత్కాలిక సడలింపులు ఇచ్చింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా