పత్తికి ‘పట్టు’ చేరితే మాస్కు భేష్‌!

26 Apr, 2020 01:25 IST|Sakshi

అవసరం అన్నీ నేర్పిస్తుందని అంటారు. కరోనా వైరస్‌ విషయంలో ఇది అక్షరాలా నిజమని ఈ మహమ్మారి కట్టడికి జరుగుతున్న అనేకానేక ప్రయోగాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటా రెండా.. వ్యాక్సిన్ల కోసం వందల సంఖ్యలో ప్రయత్నాలు జరుగుతుంటే.. మందుల తయారీకి, కరోనా గుట్టుమట్లను కనిపెట్టేందుకు బోలెడంత మంది పరిశోధనలు చేస్తున్నారు. మనిషికి సవాల్‌ విసిరిన కరోనాను ఎదుర్కొనేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల్లో మచ్చుకు కొన్ని..

కరోనా వైరస్‌ పుణ్యమా అని ఇప్పుడిక ముఖానికి ఓ తొడుగు తప్పనిసరి కానుంది. మరి, ఏ రకమైన వస్త్రంతో తయారైన మాస్కు ధరిస్తే మేలు? అమెరికాలోని షికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై కొన్ని ప్రయోగాలు చేశారు. కరోనా కట్టడికి ఇంట్లో తయారుచేసిన మాస్కు ధరించినా పర్వాలేదు కానీ, అది కాటన్, సిల్క్‌ లేదా షిఫాన్‌తో తయారైనదైతే మెరుగైన రక్షణ లభిస్తుందని ఈ ప్రయోగం చెబుతోంది. వైద్య సిబ్బందికి అవసరమైన ఎన్‌95 మాస్కులకు ఇప్పటికే కొరత ఉన్న విషయం తెలిసిందే. దగ్గు, తుమ్ముల ద్వారా వెలువడే శరీర ద్రవాల నుంచి కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందన్నది ఇప్పటికే తెలిసిన విషయం. ఈ తుంపర్లు ఏకరీతిన ఉండవు.

పత్తి, పట్టుల మిశ్రమంతో తయారైన మాస్కు కరోనా రోగుల నుంచి వెలువడే ద్రవాలను మెరుగ్గా అడ్డుకోగలదని షికాగో వర్సిటీకి చెందిన సుప్రాతిక్‌ గుహా తెలిపారు. దీన్ని నిర్ధారించేందుకు వీరు తుంపర్లను మిశ్రమంచేసే ఓ యంత్రాన్ని ఉపయోగించారు. పది నానోమీటర్ల నుంచి ఆరు మిల్లీమీటర్ల వ్యాసంతో కూడిన తుంపర్లను సృష్టించి ఓ ఫ్యాన్‌ సాయంతో వీటిని వేర్వేరు వస్త్రాలపై ప్రయోగించి చూశారు. ఊపిరితీసుకునే వేగం, దగ్గు, తుమ్ముల వల్ల తుంపర్లు ప్రయాణించే వేగాలకు అనుగుణంగా చేసిన ప్రయోగాల్లో బాగా గట్టిగా నేసిన ఒక పొర కాటన్, రెండు పొరల పాలిస్టర్‌ స్పాండెక్స్‌ షిఫాన్‌ 80–90 శాతం తుంపర్లను అడ్డుకున్నట్టు స్పష్టమైంది.

ఇది ఎన్‌95 మాస్కు పనితీరు కు దగ్గరగా ఉండటం గమనార్హం. షిఫాన్‌ స్థానంలో పట్టు వస్త్రాలను ఉపయోగించినప్పుడు కూడా ఫలితాల్లో పెద్దగా మార్పు లేదు. బాగా గట్టిగా నేసిన పట్టు తుంపర్లను బాగా అడ్డుకుంటాయని, షిఫాన్, పట్టులాంటి వస్త్రాల ఉపరితలంపై ఉండే స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ వైరస్‌కు నిరోధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే మాస్కులు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ లభించడం కష్టమవుతుందని, ముఖానికి, మాస్కుకు మధ్య ఖాళీ ప్రదేశం ఉంటే వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం సగానికిపైగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. చదవండి: సెప్టెంబర్‌లో కొత్త విద్యా సంవత్సరం

మరిన్ని వార్తలు