రోడ్డు భద్రత ఎక్కడ..? 

11 Sep, 2019 04:04 IST|Sakshi

తీరని ఓవర్‌లోడింగ్‌ సమస్య.. పట్టించుకోని అధికారులు

కొండగట్టు ప్రమాదానికి నేటితో సంవత్సరం

ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 4,300 మంది బలి 

15 వేల మందికిపైగా క్షతగాత్రులు  

సాక్షి, హైదరాబాద్‌: దేశసరిహద్దుల్లో చనిపోయే సైనికుల కన్నా.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యే అధికం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ 11న జరిగిన జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం ఘాట్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదం దేశచరిత్రలోనే ఒక చీకటి దినంగా మిగిలిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఏ, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి 65 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 100 అడుగుల లోయలో పడ్డా.. 30 మందికి మించి మరణించిన దాఖలాలు లేవు. కానీ, పట్టుమని 10 అడుగుల లోతులేని కందకం లో పడి భారీ ప్రాణనష్టం జరగడం ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.  

ఓవర్‌లోడింగ్‌.. 
కొండగట్టు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఓవర్‌లోడింగ్‌. బస్సు సామర్థ్యం 44 సీట్లు కాగా దుర్ఘటన సమయంలో బస్సులో 110 మంది వరకు ప్రయాణికులు ఎక్కారు. ఫలితంగా కందకంలో పడగానే.. మహిళలు, చిన్నారులు ఊపిరాడక ప్రాణాలొదిలారు. ప్రమాదం జరిగిన రోజు 57 మంది మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65కి చేరింది. దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇంతటి భారీ ప్రాణనష్టం ఇదే కావడం గమనార్హం. ఘటనాస్థలాన్ని రవాణామంత్రి, ఆర్టీసీ చైర్మన్, రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ సంబంధిత అధికారులంతా పరిశీలించారు. ఆ దుర్ఘటన తర్వాత ఆర్టీఏ నాలుగు రోజుల పాటు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంది. అంతమంది ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత ప్రభుత్వం రోడ్డు భద్రతలో ప్రత్యేకంగా చర్యలేమీ తీసుకోకపోవడం గమనార్హం. ప్రమాదానికి కారణమైన ఘాట్‌ రోడ్డుపై భారీ వాహనాలను, బస్సులను కంటితుడుపు చర్యగా నిషేధించింది. కానీ, ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణాలో, గూడ్సు వాహనాల్లో ఓవర్‌ లోడింగ్‌ సమస్య కొనసాగుతూనే ఉంది. 

రోజుకు 646 కేసులు 
రాష్ట్రంలో రోజుకు సగటున 646 ఓవర్‌లోడింగ్‌ కేసులు బుక్కవుతున్నాయి. సెప్టెంబర్‌ 5 వరకు వీటి సంఖ్య దాదాపుగా 15,400 వరకు చేరింది. రోజుకు రూ.లక్ష చొప్పున ఇప్పటిదాకా రూ.29 కోట్ల వరకు జరిమానా రూపంలో చెల్లించారు. రాష్ట్రంలో రోజుకు 59 ప్రమాదాల చొప్పున మొత్తం 14,700 వరకు రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. అందులో రోజుకు 18 మంది చొప్పున మరణిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 4,300 మంది ప్రాణాలు రోడ్డు పాలయ్యాయి. ప్రతీ 93 నిమిషాలకో ప్రాణాన్ని రోడ్డు ప్రమాదాలు బలితీసుకుంటున్నాయి. రోజుకు 62 మంది గాయపడుతుండగా ఇప్పటివరకు 15,400 మంది వరకు క్షతగాత్రులయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవర్‌లోడింగ్‌ సమస్య కారణంగా రోజుకు వందలాది కేసులు బుక్కవుతున్నా.. ఎలాంటి వాటి నివారణలో ఎలాంటి పురోగతి లేదన్న విషయం తేటతెల్లమవుతోంది.  

మరిన్ని వార్తలు