టికెట్ల బాధ్యత ప్రయాణికులదే

2 Jan, 2020 09:30 IST|Sakshi

ఆర్టీసీ కండక్టర్లకు ఉద్యోగ భద్రత

విస్తృత ప్రచారం చేపట్టిన గ్రేటర్‌ ఆర్టీసీ

బస్టాపుల వద్ద తనిఖీ బృందాలు

టికెట్‌ లేకుండా పయనిస్తే రూ.500 జరిమానా  

సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడో ఒక చోట విజిలెన్స్‌ సిబ్బంది మాటు వేసి ఉంటారు. ఆ మార్గంలో వెళ్లే బస్సును ఆకస్మాత్తుగా నిలిపేస్తారు. అంతే ఇక కండక్టర్‌కు ముచ్చెమటలు పట్టేస్తాయి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటారు. ఆ క్షణం లో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో  తెలియ ని ఆందోళన, ఏ ఒక్క ప్రయాణికుడు టిక్కెట్‌ తీసుకోకపోయినా అందుకు  బాధ్యత వహించవలసిన దుస్థితి. ఇదంతా నిన్నటి సంగతి. ఇప్పుడు కండక్టర్లకు ఆ భయం లేదు. నిశ్చింత గా, నిర్భయంగా  విధులు నిర్వహించవచ్చు. టిక్కెట్‌ తీసుకోవలసిన  బాధ్యత  ఇక పూర్తిగా ప్రయాణికుడిదే. ఈమేరకు ఆర్టీసీ సైతం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. ఇటీవల కార్మికులు చేపట్టిన సుదీర్ఘమైన సమ్మెలోనూ టిక్కెట్‌  తీసుకోవలసినబాధ్యత ప్రయాణికులదేనని  డిమాండ్‌ చేసిన సంగతి  తెలిసిందే. ఈ అంశంపైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కండక్టర్లకు ఉద్యోగభద్రతను కల్పిస్తూ టిక్కెట్‌ల బాధ్యతను ప్రయాణికులపైనే మోపింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 178 ప్రకారం  ప్రయాణికులు తప్పనిసరిగా టిక్కెట్‌తీసుకొని ప్రయాణం చేయాలని, టిక్కెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే  రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని  పేర్కొంటూ  ఆర్టీసీ  ముమ్మర ప్రచారం చేపట్టింది. కొత్త ఏడాది నగరంలోని అన్ని అలైటింగ్‌ పాయింట్‌   వద్ద తనిఖీలను ఉధృతం చేయనున్నట్లు  ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ అధికారులు తెలిపారు. 

ఎన్నో పోరాటాల ఫలితం...
నిజానికి  టిక్కెట్‌ల అంశం కండక్టర్లకు కత్తిమీద సాములా మారింది.  వివిధ రూట్‌లలో అత్యధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందజేస్తూనే టిక్కెట్‌లపైన వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి తక్కువగా ఉన్నా కఠిన చర్యలు  తీసుకోవడం వేలాది మంది కండక్టర్ల ఉద్యోగభద్రతకు ముప్పుగా పరిణమించింది. అలా ఎంతోమందిపైన సస్పెన్షన్‌ వేటు పడింది. ఉద్యోగాలకు దూరమై ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్లు, ఉపాధిని కోల్పోయి  రోడ్డున పడ్డ కార్మికులు ఎంతోమంది ఉన్నారు.  ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో సుమారు 8 వేల మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో  ఒక బస్టాపులో  ఎక్కి ఆ తరువాత బస్టాలోనే దిగే ప్రయాణికులు, ఒకటి,రెండు బస్టాపులకు టిక్కెట్‌ తీసుకొకుండా తప్పించుకొనేవాళ్లు  చాలా మంది ఉంటారు. కానీ  ఈ క్రమంలో విజిలెన్స్‌ తనిఖీల కారణంగా  కండక్టర్లు మూల్యం చెల్లించవలసి వచ్చేది.  నగరంలోని 29 డిపోల పరిధిలో ఎక్కడో ఒక చోట కండక్టర్లపైన వేటు పడడం పరిపాటిగా మారింది. మరోవైపు  తాము టిక్కెట్‌ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ  కండక్టర్లు  తమ వద్దకు రాకుండానే ఉండిపోయారని  తరచుగా ప్రయాణికులు బుకాయించేవారు.  గతంలో పావలా పైసల టిక్కెట్‌ తీసుకోకపోయినా  కండక్టర్లే మూల్యం చెల్లించవలసి వచ్చేది. ఇలాంటి పరిణామాల బారి నుంచి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని  కార్మికులు అనేక ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని టిక్కెట్‌  బాధ్యతను ప్రయాణికులపైన మోపడంతో ఆర్టీసీ కండక్టర్లకు ఊరట లభించినట్లయింది.

బస్టాపుల్లోనే తనిఖీలు  
మరోవైపు ఇక నుంచి బస్టాపుల్లోనే తనిఖీలను నిర్వహిస్తారు. రోడ్లపైన బస్సులను నిలిపేసి  మార్గమధ్యలో తనిఖీలు చేయడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది.  అప్పటికే బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాసిన వాళ్లు మరో గంట పాటు టిక్కెట్‌ల తనిఖీల  కోసం నిరీక్షించవలసి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు బస్సు దిగే బస్టాపుల్లో మాత్రమే  విజిలెన్స్‌ సిబ్బంది  విధులు నిర్వహిస్తారు. లాస్ట్‌ బస్టాపుల్లో  బస్సులు ఆగిన తరువాత రెండు వైపులా ఫుట్‌బోర్డుపైన నించొని తనిఖీలు చేస్తారు. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే ఈ పద్ధతి అమల్లో ఉంది, త్వరలో  పూర్తిస్థాయిలో ఆన్‌రోడ్‌ తనిఖీలకు స్వస్తి చెప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు