‘ఆసరా’పై సామాజిక తనిఖీ

8 Jul, 2015 01:42 IST|Sakshi

నల్లగొండ : ‘ఆసరా’ పెన్షన్లలో చోటు చేసుకున్న అక్రమాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికలో భారీ అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రాథమికంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో మొత్తం పింఛన్‌దారుల్లో 20 శాతం మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సంకేతాలు ఇచ్చారు. ఆస రా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే సామాజిక తనిఖీ అంశాన్ని పొ ందుపర్చారు.
 
 కానీ పథకం ప్రారంభదశలోనే దీనిని అమలు చేస్తే అన్ని వైపుల నుంచి విమ ర్శలు వస్తాయన్న అభిప్రాయంతో మొదట్లో వెనక్కి     త గ్గింది. ఆసరా పెన్షన్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి...అందుకు బాధ్యులైన నలుగురు పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తొలగించారు. కానీ ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. గ్రామాలతో పోలిస్తే...మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోనే భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులకు సమాచారం ఉంది. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అనర్హులను కూడా ఆసరా పెన్షన్లలో చోటు కల్పించినట్లు పక్కా సమాచారం సేకరించిన అధికారులు తమ ఫోకస్ అంతా వాటిపైనే పెట్టారు.
 
 పింఛన్లు-కుటుంబాలు పెరిగాయ్...
 ఆసరా పెన్షన్లకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలుపుకుని పింఛన్‌దారులు మొత్తం 3,94,717 మంది ఉండగా...ప్రస్తుతం 4,02,509 మంది ఉన్నారు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్య 8.34 లక్షలు ఉంటే...సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆ సంఖ్య 11.35 లక్షలకు పెరిగాయి. దీంతోపాటు నెలవారీ చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు, వికలాంగుల పింఛన్ ఐదు వందల నుంచి రూ.1500లకు పెంచారు. పింఛదారుల్లో వికలాంగులు, కల్లుగీత కార్మికులు గతంలో ఉన్నవాటి కి మించి భారీగా పెరిగారు.
 
  సదరమ్ క్యాంపుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికి వికలత్వాన్ని నిర్ధారించడంలో వైద్యులు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కనగల్, తిరుమలగిరి మండలాల్లో బోగస్ సదరమ్ సర్టిఫికెట్లు ద్వారా పింఛన్ పొందడాన్ని పసిగట్టిన అధికారులు వారిపై కేసులు కూడా నమోదు చేశారు. క ల్లు గీత కార్మికుల్లో చోటామోటా రాజకీయ నాయకులు, వృద్ధాప్య పెన్షన్‌దారుల్లో అనర్హులు ఉన్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఆసరాలో అనర్హులు ఏరివేయాలంటే సామాజిక తనిఖీ ఒక్కటే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
 
 సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికం...
 ఉపాధి హామీ పథకంలో అమలు చేసిన విధంగానే ఆసరా పెన్షన్లలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లో వేర్వేరు బృందాలు పర్యటిస్తాయి. లబ్ధిదారుల జాబితా ఆధారంగా సర్వే జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఆర్థిక, సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. ఈ తనిఖీలో అనర్హులు తేలినట్లయితే అందరికీ తెలిసే విధంగా బహిరంగ సభలు నిర్వహించి ఆసరా జాబితా నుంచి వారిని తొలిగిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, ఇప్పటివరకు చెల్లించిన సొమ్మును రికవరీ చేస్తారు. సామాజిక తనిఖీకి సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరక్టర్ చిర్రా సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సెర్ప్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెలాఖరు నుంచి సామాజిక తనిఖీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు