ప్రూవ్‌ చేస్తే ఉరే!

2 Dec, 2019 04:48 IST|Sakshi

జస్టిస్‌ ఫర్‌ దిశ హత్య కేసులో కీలకం కానున్న విచారణ

లారీలో సేకరించిన రక్తపు మరకలు, వెంట్రుకలే కీలకం

ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో శాస్త్రీయ,

భౌతిక ఆధారాలే కేసుకు బలం

సాక్షి, హైదరాబాద్‌: దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరే సరి అంటూ చేస్తోన్న ప్రజాందోళనలకు తగ్గట్టుగానే సైబరాబాద్‌ పోలీసులు పనిచేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు లేని ఈ కేసులో పరోక్ష సాక్ష్యాలు, భౌతిక సాక్ష్యాలతో నిందితులు మహమ్మద్‌ ఆరీఫ్, శివ, నవీన్‌ కుమార్, చెన్నకేశవులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అత్యాచారం జరిగిన ఓఆర్‌ఆర్‌ తొండుపల్లి టోల్‌గేట్‌ సర్వీసు రోడ్డు ప్రాంతం, పెట్రోల్, డీజిల్‌ పోసి మృతదేహన్ని కాల్చిన షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో లభించిన శాస్త్రీయ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన మృతురాలి దుస్తులు, నిందితులు తాగిన మందు బాటిళ్లు, లారీలో నుంచి సేకరించిన దిశ రక్తపు మరకలు, వెంట్రుకలు, మృతదేహం దహనం చేసిన ప్రాంతం నుంచి సేకరించిన రిస్ట్‌ వాచ్, కొత్తూరులో స్వాధీనం చేసుకున్న మృతురాలి బైక్‌ ఈ కేసులో కీలకం కానున్నాయి.

లారీలో నుంచి సేకరించిన రక్తపు మరకలు, వెంట్రుకలు మృతురాలివేనని తేలితే నిందితులు తప్పించుకునే అవకాశం లేదు. అత్యాచార సమయంలో ఆమె ప్రతిఘటించినప్పుడు ఆమె వేళ్లకు నిందితుల కణాలు అంటుకున్నా మృతదేహాన్ని కాల్చేయడంతో సరైన ఆధారం లేకుండా పోయింది. పోలీసులకు లభించిన దిశ దుస్తులకు నిందితుల వీర్యకణాలు అంటుకొని ఉంటే డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారణ కానుంది. నిందితులు ఆమె దుస్తులను విప్పి పక్కకు పడేయడంతో వారి వీర్యకణాలు అంటుకొని ఉండే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. స్కూటీలో గాలి నింపేందుకు సమీపంలోని పంక్చర్‌ షాప్‌కు వచ్చిన నిందితుడి గురించి ఆ యజమాని పోలీసులకు చెప్పడం కూడా కేసు విచారణలో ఉపయోగపడనుంది.

టెక్నికల్‌ డేటాది కీలక పాత్ర...
అత్యాచారం జరిగిన సమయంలో నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా అదే ప్రాంతంలో సూచించడం కూడా ఈ కేసుకు బలం చేకూరేలా ఉంది. నవీన్, శివ ఓ బాటిల్‌ తీసుకొని పెట్రోల్‌ కోసం కొత్తూరు శివారులోని ఎస్‌ఆర్‌ బంక్‌కు వెళ్లిన దృశ్యాలతోపాటు అక్కడే సమీపంలోని ఐవోసీ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ను బాటిల్‌ లో కొనుగోలు చేసినట్లు సీసీటీవీ రికార్డుల్లో ఉండటం కూడా ఈ కేసులో ఉపయోగపడనుంది. తొండుపల్లి టోల్‌గేట్‌ నుంచి షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతం వరకు లారీ, స్కూటీ వెళ్లిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దిశ స్కూటీని నిందితులు నడుపుకుంటూ వెళ్లడం సాంకేతిక సాక్ష్యంగా ఉపయోగపడనుంది.

నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులివి...
120 (బీ): నేరపూరితమైన కుట్ర (నేర తీవ్రతను బట్టి జైలుశిక్ష)
366: కిడ్నాప్‌ చేయడం (పదేళ్ల వరకు జైలు శిక్ష)
506: చంపుతానని బెదిరించడం (రెండేళ్ల జైలుశిక్ష)
376 (డీ): సామూహిక అత్యాచారం (చనిపోయే వరకు జైలుశిక్ష)
302: హత్య చేయడం (నేర తీవ్రతను బట్టి జైలుశిక్ష)
201 రెడ్‌విత్‌ 34: సాక్ష్యాలను తారుమారు చేయడం (నేరతీవ్రతను బట్టి జైలుశిక్ష)
392: దోపిడీ (14 ఏళ్ల జైలుశిక్ష)

>
మరిన్ని వార్తలు