ఫోన్‌ దూరమైతే  మనీ దగ్గరవుతుంది

16 Dec, 2018 02:45 IST|Sakshi

మీరు స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారా..? మీ ఫోన్‌ను ఒక్క గంట పాటు వాడకుండా ఉండగలరా..? అది కూడా ఓ ఏడాది పాటు కనీసం మీ స్మార్ట్‌ ఫోన్‌ను చూడకుండా ఉండగలరా..? అమ్మో ఫోన్‌ వాడకుండా ఉండటమే.. అన్నం తినకుండా అయినా ఉంటామేమో కానీ ఫోన్‌ వాడకుండా ఉండటమా..! అదీ స్మార్ట్‌ ఫోన్‌! ఫేస్‌బుక్‌ ఏమైపోవాలి.. వాట్సాప్‌ ఏమైపోవాలి.. యూట్యూబ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌.. ట్విట్టర్‌లు ఏమైపోవాలి.. ఫ్రెండ్స్‌తో చాట్‌ చేయకుండా ఉండగలమా అనే కదా మీ సమాధానాలు..?! ఊరికే కాదు లెండి బోలెడు డబ్బులు వస్తాయి.. అది కూడా ఏ వేయో.. లక్షో కాదు.. ఏకంగా దాదాపు రూ.72 లక్షలు. అవును ఇది నిజమే.. కోకా కోలాకు చెందిన విటమిన్‌వాటర్‌ అనే సంస్థ ఈ పోటీని పెట్టింది. 365 రోజుల పాటు స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్‌ పీసీ వాడకుండా ఉంటే ఆ మొత్తాన్ని రివార్డుగా ఇస్తుంది. అయితే వేరే వారి ఫోన్‌ కూడా ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు.

అలా అని కంపెనీతో ఒప్పందం చేసుకోవాలి. ఇంకే అంత డబ్బు వస్తుంది కదా.. దరఖాస్తు చేసుకుందాం అనుకుంటున్నారా.. ఆగండాగండి. ఇంకో ట్విస్ట్‌ ఉందండి.. మీరు ఈ పోటీకి అర్హులని ఆ కంపెనీని ఒప్పించాలి. మీ ఫోన్‌ను ఎందుకు వదిలిపెట్టాలనుకుంటున్నారో ఆ కంపెనీకి రాసి, ‘నోఫోన్‌ ఫర్‌ ఎ ఇయర్‌’‘కాంటెస్ట్‌’హ్యాష్‌ట్యాగ్‌ చేసి ట్విట్టర్‌లో పంపాలి. అలా రాసిన కథనాల్లో కొన్ని క్వాలిటీలను చూసి ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 8 వరకు సమయం ఉంది. జనవరి 22న ఎంపికైన వారిని కంపెనీ ప్రకటించనుంది. అయితే ఎంపికైన వారికి కేవలం కాల్స్‌ చేసుకుని మాట్లాడుకునేందుకు 1996 నాటి ఓ ఫోన్‌ను ఇస్తుంది. అయితే 365 రోజులు అయిపోయిన తర్వాత ఈ పోటీలో గెలిచిన వారికి లై డిటెక్టర్‌తో పరీక్షలు జరిపిన తర్వాతే ఆ డబ్బు మొత్తాన్ని అందజేస్తుందట. ఇంకా పూర్తి రూల్స్‌ ఆ కంపెనీ వెల్లడించలేదు. ఇంకా ఎన్ని షరతులు పెట్టిందో మరి.. పూర్తిగా చదువుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోండి. 

మరిన్ని వార్తలు