అనాథలను ఆదుకోరూ...

28 Apr, 2018 09:02 IST|Sakshi
అమ్మమ్మ చంద్రమ్మతో చిన్నారులు

నెల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి

కదల్లేనిస్థితిలో అమ్మమ్మ

అనాథలైన ముగ్గురు చిన్నారులు

దాతలు ఆదుకోవాలని వినతి

వెల్గటూరు(ధర్మపురి) : రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. లైన్‌ బండి(లారీ) నడుపుతున్న నాన్న, పొద్దంతా బీడీలు చుట్టే అమ్మ నెల వ్యవధిలో అంతుచిక్కని వ్యాధితో మరణించడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. వీరిలో పెద్ద పాప కూడా అనారోగ్యం బారిన పడడం.. అమ్మమ్మ లేచి నడవలేని స్థితిలో ఉండడం ఆ కుటంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం చిన్నారులకు బంధువులు బుక్కెడు వండి పెడితే తింటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం .. మండలంలోని కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన పొనగంటి శ్రీనివాస్‌(45), బుజ్జవ్వ (38) దంపతులు అంతుచిక్కని వ్యాధి బారినపడి నెల వ్యవధిలో మృతి చెందారు. దీంతో వారిపిల్ల్లలు శ్రీవాణి(17), వెంకటేశ్‌(13), వైష్ణవి(10) వీధిన పడ్డారు. జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బుజ్జవ్వను వివాహం చేసుకుని ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు.

సుమారు 20ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. శ్రీనివాస్‌ పెట్రోల్‌ ట్యాంకర్‌ లైన్‌బండి నడుపుతుండగా అతడి భార్య బీడీలు చుడుతూ పిల్లలను పోషించుకుంటున్నారు. నెలక్రితం శ్రీనివాస్‌ మరణించగా.. గురువారం బుజ్జవ్వ మృతి చెందింది. దీంతో పిల్లలు అనాథలయ్యారు. వీరితో పాటు ఉంటున్న అమ్మమ్మ చంద్రవ్వ కళ్లు కనపడక లేవలేని స్థితిలో ఉంది. ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి పిల్లల చదువు ఆగిపోకుండా.. వారిని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు