తాళం వేసి ఉంటే లూటీనే..! 

29 Nov, 2019 09:02 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌

చోరీలకు  పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్‌

బంజారాహిల్స్‌: తాళంవేసి ఉన్న ఇంటి తాళాలు పగలకొట్టి ఖరీదైన సెల్‌ఫోన్లు, నగలు, నగదును తస్కరించిన ఘటనలో నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌.రావు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్, డీఎస్‌ఐ ఇ.రవితో కలిసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఘటన వివరాలు వెల్లడించారు. దుబాయ్‌లో నివసించే మహ్మద్‌ ఇమ్రాన్‌ సయ్యద్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ఈనెల 24న ఉదయం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు ఓ వివాహ విందులో పాల్గొనేందుకు వచ్చాడు. తన బంధువులు, స్నేహితులకు ఇచ్చేందుకు 22 సెల్‌ఫోన్లను, ఒక ట్యాబ్‌ను, ఒక కెమెరాను తీసుకువచ్చాడు. తీసుకువచి్చన సామగ్రిని బ్యాగ్‌లోనే పదిలపరిచి ఇంట్లో ఉంచి సాయంత్రం తాళం వేసి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారు. విందు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలకొట్టి ఉంది. లోనికి వెళ్లిచూడగా దుబాయ్‌ నుంచి తాను తీసుకువచి్చన సెల్‌ఫోన్లతో పాటు నగలు, నగదు కనిపించలేదు. అదే రోజు రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన క్రైమ్‌ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి దొంగతనం చేసిన వస్తువులతో వెళుతున్న దృశ్యాలు నిఘా నేత్రంలో స్పష్టంగా కనిపించాయి. స్థానికులు చెప్పిన ఆధారాలతో క్రైమ్‌ పోలీసులు చాంద్రయాణగుట్ట బార్కాస్‌లో తలదాచుకున్న ఫరీద్‌ఖాన్‌ అలియాస్‌ ఫరీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయింది. నిందితుడు నుంచి 22 సెల్‌ఫోన్లతో పాటు ఒక ట్యాబ్, ఒక కెమెరా, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.23 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఫరీద్‌ గతంలో కూడా హిమాయత్‌నగర్, సైఫాబాద్, గోల్కొండ, లంగర్‌హౌజ్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు ఆ కేసుల్లో రిమాండ్‌కు వెళ్లినట్లు తెలిపారు. తాజాగా అరెస్టు చేసిన కేసుతో పాటు గతంలో ఇంకో ఐదు కేసుల్లో నిందితుడని ఆయన తెలిపారు. కారు మెకానిక్‌గా పనిచేస్తున్న ఫరీద్‌ జల్సాకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. క్రైమ్‌ పోలీసులను డీసీపీ అభినందించారు. 

>
మరిన్ని వార్తలు