జైళ్ల శాఖ డీజీకి మీడియా సెగ

30 Oct, 2018 02:12 IST|Sakshi
జర్నలిస్టులకు వార్నింగ్‌ ఇస్తున్న డీజీ వీకే సింగ్‌

బహిరంగ క్షమాపణ చెప్పేవరకు నో కవరేజ్‌

స్పష్టం చేసిన జర్నలిస్టులు

ప్రెస్‌మీట్‌ బహిష్కరణతో కార్యాలయం నుంచి వెళ్లిపోయిన డీజీ

సాక్షి, హైదరాబాద్‌: ఒక మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను కమర్షియల్‌ సెక్స్‌ వర్కర్లంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ను జర్నలిస్టులు ఘెరావ్‌ చేశారు. కలప రవాణాకు సంబంధించి ఓ మీడియా సంస్థ ప్రసారం చేసిన కథనాలపై వివరణ ఇచ్చేందుకు సోమవారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖ హెడ్‌క్వార్టర్స్‌లో వీకే సింగ్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఈ మీడియా సమావేశానికి వెళ్లిన జర్నలిస్టులు వీకే సింగ్‌కు నిరసన తెలిపారు. సెక్స్‌ వర్కర్లంటూ సంబోధించిన అంశాలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనికి వీకే సింగ్‌ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సంబంధిత మీడియా సంస్థ, ఆసంస్థ జర్నలిస్టుతో ఏకీభవిస్తున్న వాళ్లందరూ బ్లాక్‌మెయిలర్లతో సమానమంటూ మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించారు. దీనితో జర్నలిస్టులకు, వీకే సింగ్, ఇతర అధికారులతో వాగ్వాదం జరిగింది. క్షమాపణ చెప్పేంతవరకు జైళ్ల శాఖకు సంబంధించిన మీడియా కవరేజీలు చేసేది లేదని జర్నలిస్టులు స్పష్టం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన డీజీ ఆ ఛాన ల్‌పై మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జర్నలిస్టులకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ చానల్‌కి మద్దతు పలికే మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండానే సింగ్‌ వెనుదిరిగి వెళ్లిపోయారు.  

మీడియా బాగుకోసం పోరాడతా: వీకే సింగ్‌ 
తాను కేవలం ఒక మీడియా సంస్థ, ఆ జర్నలిస్టులనుద్దేశించి మాత్రమే కామెంట్‌ చేశానని, ఆ సంస్థ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వారితో మరో మీడియా ఏకీభవించడం సమాజానికి మంచిది కాదని, ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియా ఎన్నో ఉద్యమాలను ప్రసారం చేసి తెలంగాణ వచ్చేలాగా చేసిందని, కానీ ఒక మీడియా చేసిన పనివల్ల మొత్తం మీడియా అలా బ్లాక్‌మెయిలింగ్‌ వైపు వెళ్లకూడదని కోరుతున్నానన్నారు. ‘సేవ్‌ మీడియా’పేరుతో తాను ఉద్యమం చేస్తానని, సంబంధిత మీడియా వల్ల నష్టపోయిన వాళ్లుంటే తనను ఆశ్రయించాలని సూచించారు. అదేవిధంగా చానల్‌ నడిపేందుకు డబ్బులు కావాలంటే తాము చందాలిస్తామని, అంతేగానీ ఇలా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. అకారణంగా తనను అప్ర తిష్టపాలు చేసిన ఆ న్యూస్‌ చానల్‌పై యుద్ధం చేస్తానని సింగ్‌ తెలిపారు. తనపై ఆ ఛానల్‌ తప్పుడు వార్త ప్రసారం చేసిందని, నిరాధారమైన ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించిన ఆ చానల్‌పై యుద్ధం ప్రకటించినట్లు తెలిపారు. ఆ చానల్‌ను వ్యభిచారులతో పోల్చినందుకు వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు