సమంత దారిలోనే..

18 Feb, 2019 10:14 IST|Sakshi
‘మిస్‌ తెలంగాణ’ టైటిల్‌ అందుకుంటున్న ప్రియాంక (ఫైల్‌)

చేనేత వస్త్రాలతో ఫ్యాషన్, ర్యాంప్‌ షోలు  

సోషల్‌ మీడియాలో తనదైన శైలిలో ప్రచారం

‘మిస్‌ తెలంగాణ 2017’ టైటిల్‌ విజేత ప్రియాంక   

చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు సినీ స్టార్స్‌ క్యాంపెయిన్‌ చేస్తున్న విషయం విదితమే.  సినీనటీ సమంత తెలంగాణ చేనేత రంగానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోషల్‌ మీడియాలోచురుకైన పాత్ర పోషిస్తోంది. ఆ కోవలోనేచేనేతకు వన్నె తెచ్చేందుకు, దాని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు పాటుపడుతోంది ప్రియాంక దారపు. తనకిష్టమైన ఈ రంగంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకెళుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ర్యాంప్‌ షోలలోహొయలొలికిస్తూ చేనేత వృత్తిదారుల్లోనూతనోత్సాహాన్ని నింపుతోందీసిటీ యువతి.

హిమాయత్‌నగర్‌ : నగరంలోని మాదాపూర్‌నకు చెందిన ప్రియాంక దారపు ఫ్యాషన్‌ కోర్సులో బీఎస్సీ చేసింది. ప్రస్తుతం ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ను రన్‌ చేస్తూ, చేనేత రంగాన్ని బలపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ‘మిస్‌ తెలంగాణ 2017’ టైటిల్‌ని సాధించిన ప్రియాంక ఫ్యాషన్‌ రంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతోంది.  

రెండేళ్లుగా ఫ్యాషన్‌ షోలు..  
చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఫ్యాషన్‌ షోలకు కొంతమంది మోడల్స్‌ను ఎంపిక చేశారు. వీరిలో నగరం నుంచి ప్రియాంక ఎంపికైంది. దీంతో ఆమె ఫ్యాషన్‌ షోలలో చేనేత కార్మికులు రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌ చేస్తూ ఆ రంగానికి వన్నె తెస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే చేనేత ఫ్యాషన్‌ షోలలో తెలంగాణ నుంచి తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది ప్రియాంక.  

సోషల్‌ మీడియాద్వారాప్రమోషన్‌
కేవలం ర్యాంప్‌ షోలతో సరిపుచ్చుకోక తన వంతు బాధ్యతగా చేనేత రంగాన్ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, ఆ దిశగా నేటి యువత ఓ అడుగు ముందుకు వేయాలంటూ ప్రియాంక పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ర్యాంప్‌ షో నుంచి సిటీకి వచ్చాక ‘ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌’ వంటి సోషల్‌ మీడియా వేదికగా లైవ్‌లు
చేస్తోంది. ప్రస్తుతం చేనేతలో అనేక ఆకర్షణీయమైన డిజైన్లలో దుస్తులను కార్మికులు రూపొందిస్తున్నారని, వాటిని ధరించాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందంటూ లైవ్‌లో చెబుతోంది.

ఖాదీ ఫ్యాబ్రిక్‌పై కోచింగ్‌
కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో ప్రియాంక ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించింది. ఈ ఇనిస్టిట్యూట్‌ వేదికగా ఫ్యాషన్‌ రంగంలో వస్తున్న యువతీ యువకులకు ఖాదీ ఫ్యాబ్రిక్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఫ్యాబ్రిక్‌లో లేటెస్ట్‌గా వచ్చే డిజైన్స్‌ని వాళ్లకి వివరిస్తూ.. కొత్తదనాన్ని పరిచయం చేస్తోంది.  

బ్రాండ్‌ అంబాసిడర్‌ నా లక్ష్యం
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించే ర్యాంప్‌ షోలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ, కాకినాడ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ప్రజల నుంచి చాలా రెస్పాన్స్‌ వచ్చింది. ఏపీతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టే కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ, ఏపీలకు ‘చేనేత రంగం’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండాలనేది నా అభిమతం.    – ప్రియాంక దారపు  

మరిన్ని వార్తలు