లంచావతారం

17 Jan, 2015 04:30 IST|Sakshi
లంచావతారం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  ‘బీబీనగర్ నుంచి మేళ్లచెరువు వరకు... దామరచర్ల నుంచి మర్రిగూడ, మాల్ వరకు... చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు... రూటు ఏదయినా జిల్లాలో అవినీతి మాత్రం ‘నా దారి... రహదారి’ అంటోంది. లంచావతారులు ప్రజలను పీడించి డబ్బులు దండుకుంటున్నారు. పింఛన్ కావాలన్నా.. రేషన్‌కార్డు రావాలన్నా... భూమి కొనాలన్నా.. ఇల్లు కట్టుకోవాలన్నా.. సర్టిఫికెట్లు కావాలన్నా.. సంతకాలు కావాలన్నా.. పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ పెట్టాలన్నా.. రైతు పేరిట రుణం ఇవ్వాలన్నా... ఇలా ఏ పనికయినా చేయి తడవనిదే జిల్లాలో పనులు జరగడం లేదు. జిల్లా, మండల అధికారులనుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు... ప్రభుత్వ ఉద్యోగులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా.. ప్రజలకు పనులు చేయాలంటే మాత్రం డబ్బులు అడుగుతున్నారు.
 
 ఇదంతా ఏదో కథ చెపుతున్నట్టు కాదు.. ఎలాగూ సమాజంలో అవినీతి ఉంది కదా అని అందరికీ అంటగట్టడం కాదు.. సాక్షాత్తూ జిల్లా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులివీ.. అవినీతి అంటే చంపేస్తానంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆదివారం వరంగల్‌లో ఇచ్చిన టోల్‌ఫ్రీ నంబర్ 040-23454071కు ఫోన్‌చేసి మరీ వ్యక్తం చేసిన ఆవేదనలివి. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లా నుంచే అవినీతిపై 82 ఫోన్లు వెళ్లాయని అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే.ఖాన్ గత బుధవారం వెల్లడించారు. అయితే, అవినీతిపై జిల్లా ప్రజలు ఎలాంటి  ఫిర్యాదులు  చేశారన్న దానిపై ‘సాక్షి’ కొంత సమాచారం సేకరించింది. అందులోని వివరాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫిర్యాదుదారులిచ్చిన సమాచారం ఆధారంగా జిల్లాలో జరుగుతున్న అవినీతి తంతు ఇది.
 
 ఎందెందు వెతికినా...
 ప్రముఖ సాహితీవేత్త శ్రీశ్రీ తన కవితలో సబ్బుబిళ్ల.. అగ్గిపుల్లా.. కవితకు కాదేదీ అనర్హం అన్నట్టు.. జిల్లాలో ఏ శాఖలో చూసినా అవినీతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లావాసులు సీఎం ఇచ్చిన టోల్‌ఫ్రీనంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఆశ్చర్యం కూడా కలగక మానదు. తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమేనని, అయితే మాకు అదనంగా సెలవులు కావాలన్నా, డీఏ మంజూరు చేయాలన్నా, ఇంక్రిమెంట్లు రావాలన్నా మా ఉన్నతాధికారులు డబ్బులు అడుగుతున్నారని కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, సామాన్య ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని చూస్తే రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, ఆర్‌టీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఉండే ఓ ప్రభుత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి కలెక్షన్ వారానికి రూ.2లక్షలు ఉందని, ఆయనకు మొత్తంమీద రూ.50 కోట్లకు పైగా ఆస్తులున్నాయని కూడా ఫిర్యాదు అందింది. ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి కలెక్షన్ రాజాగా మారిపోయాడని కూడా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ పెట్టేందుకు స్థానిక విద్యుత్ అధికారులు తనను లంచం అడుగుతున్నారని ఓ రైతు ఫిర్యాదు చేస్తే, మరో రైతు తనకు బ్యాంకు రుణం ఇచ్చేందుకు కూడా పైసలడుగుతున్నారని టోల్‌ఫ్రీనంబర్‌కు ఫోన్‌చేసి వాపోయాడు.
 
 ఇక, మండల కార్యాలయాల్లో పనిచేసే వారు ఇళ్లు మం జూరు చేసేందుకు, పింఛన్లు ఇచ్చేందుకు డబ్బులు అడుగుతున్నారని కొందరు, ఫలానా మండల అధికారికి డబ్బులిస్తే చాలు.. ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తున్నాడని ఓ వ్యక్తి, భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తే కార్యాలయంలోని ఉద్యోగులు తనను డబ్బులడిగారని మరో వ్యక్తి ఫిర్యాదులో చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలలు కూడా విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని, ప్రాజెక్టు ఫీజు, జేఎన్‌టీయూ ఫీజు పేరుతో అధికంగా తీసుకుంటున్నారని మరో వ్యక్తి సమాచారం ఇవ్వడం గమనార్హం. బంగారుతల్లి పథకం కింద లబ్ధి పొందేందుకు గాను డాక్టర్ సంతకం కావాల్సి ఉందని, అయితే, తన సంతకం కావాలంటే డబ్బులు కావాలని ఆ డాక్టర్ అడుగుతున్నాడని ఓ మహిళ సీఎం ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి చెప్పడం గమనార్హం. మొత్తంమీద అవినీతిపై జిల్లా నుంచి వచ్చిన ఫోన్లలో ముగ్గురు మహిళలున్నారు. అయితే, ఇంకో విచిత్రమైన ఫిర్యాదు ఏమిటంటే... తమ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరితే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఇదే సమస్య కోసం అధికారుల వద్దకు వెళితే డబ్బులు అడుగుతున్నారని అటు ఎమ్మెల్యే పనితీరు, ఇటు అధికారుల అవినీతిపై ఓ వ్యక్తి సమాచారమిచ్చారు.
 
 పింఛన్లు, రేషన్‌కార్డులకు కూడా..
 ఇక, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నట్టు జిల్లాలోని లంచావతారులు పేదల నుంచి డబ్బు గుంజుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకం, ఆహారభద్రత కార్డుల పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు గాను పైసలు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్లు, రేషన్‌కార్డులపై సీఎం ఇచ్చిన నంబర్‌కు ఎక్కువ ఫిర్యాదులు రావడం గమనార్హం. వృద్ధాప్య పింఛన్ల నుంచి నీటిపన్ను పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, కొత్త రేషన్‌కార్డు దరఖాస్తు పూర్తి చేసేందుకు కూడా తనను లంచం అడిగారని, పింఛన్ రావాలంటే డబ్బులివ్వాలని మా సర్పంచ్ చెబుతున్నాడని, మీ పేరు లిస్టులో లేదు.. నా దగ్గర రేషన్ ఇవ్వాలంటే డబ్బులివ్వాలని ఓ రేషన్‌డీలర్ అంటున్నాడని, మండల కార్యాలయాల్లో కూడా డబ్బులిస్తేనే పింఛన్లు, రేషన్‌కార్డులు వస్తున్నాయని పలువురు ఫిర్యాదులు చేయడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు