హలో.. పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ బోల్తా పడింది ! 

30 Aug, 2018 02:21 IST|Sakshi
రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు, అధికారులు

     ఉరుకులు పెట్టించిన రైల్వే అధికారులు  

     భయాందోళనకు గురైన జనం 

ఆదిలాబాద్‌టౌన్‌: రైల్వే అధికారులు మంగళవారం అర్ధరాత్రి జిల్లా యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. తలమడుగు మండలం ఉండం దగ్గర పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్రక్‌ను ఢీకొని బోల్తా పడిందని డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో అక్కడి నుంచి జిల్లా పోలీసు అధికారులకు ఈ సమాచారం అందింది. హుటాహుటిన పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న రైలులో ప్రయాణం చేస్తున్న వారి బంధువులు, స్థానికుల్లో ఆందోళన మొదలైంది.

ఆదిలాబాద్‌ రైల్వే ట్రాక్‌ నుంచి ఉండం వరకు ప్రమాదం ఎక్కడ జరిగిందని వెతుక్కుంటూ వెళ్లారు. తీరా తెల్లవారుజామున 4 గంటల సమయంలో రైల్వే అధికారులు మాక్‌ డ్రిల్‌ చేశామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారో లేదో, ఘటన జరిగితే స్పందన ఎలా ఉంటుందోనని చావుకబురు చల్లగా చెప్పడంతో అందరూ బిత్తరపోయారు.  

రైల్వే అధికారులపై ఫైర్‌.. 
రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా మాక్‌డ్రిల్‌ నిర్వహించడంపై జిల్లా ఎస్పీతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని రైల్వే అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు