దురదృష్టకరం: కేసీఆర్‌

30 Aug, 2018 02:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసంలో పార్థివదేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితరులను కేసీఆర్‌ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా కేసీఆర్‌ పేర్కొన్నారు. హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషికి సూచించారు.

గవర్నర్‌ ప్రగాఢ సంతాపం..
నందమూరి హరికృష్ణ అకాల మృతిపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమని అన్నారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.  

ముక్కుసూటి మనిషి
సాక్షి, హైదరాబాద్‌: తెల్లవారుజామున నిద్రలేవగానే దిగ్భాంత్రికర వార్త విన్నా. విషయం తెలియగానే కళ్యాణ్‌రామ్‌తో మాట్లాడా. వెంటనే నార్కెట్‌పల్లికి చేరుకున్నా. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తి. నీతినిజాయతీగా ఉండేవారు. ఒకపక్క కుటుంబ సభ్యుడిని, మరో పక్క పార్టీ నాయకుడిని కోల్పోయా. ఆయన మనసుకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నా. – చంద్రబాబు, ఏపీ సీఎం   

అమ్మగారూ.. అని ఆప్యాయంగా పిలిచేవాడు
మా కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతోంది. నా పెద్ద కుమారుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. తొలుత మా వివాహాన్ని హరికృష్ణ వ్యతిరేకించినా, ఆ తర్వాత నన్ను ఆప్యాయంగా పలకరించేవాడు. నన్ను అమ్మా.. అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమైన కుమారుడు. తండ్రికి రథసారధి. – లక్ష్మీపార్వతి  

పలువురి దిగ్భ్రాంతి
హరికృష్ణ అకాల మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు