రైల్వే గేట్ల వద్ద కాపలా ఏర్పాటు

27 Jul, 2014 03:03 IST|Sakshi
రైల్వే గేట్ల వద్ద కాపలా ఏర్పాటు

డోర్నకల్ -కారేపల్లి మార్గంలో ఇద్దరు గ్యాంగ్‌మన్లకు విధులు
డోర్నకల్ : డోర్నకల్ -కారేపల్లి మార్గంలో రెండు రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అధికారులు కాపలాను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో ఇటీవల జరిగిన దుర్ఘటన నేపథ్యంలో జిల్లాలోని రైల్వే గేట్ల వద్ద నెలకొన్న దుస్థితిపై ఈ నెల 25న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన అధికారులు డోర్నకల్ జంక్షన్ పీడబ్ల్యూ అధికారులు పుల్లూరు, వస్రాంతండాల మధ్య గల ఎల్‌సీ-1 గేటుతోపాటు పోచారం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఎల్‌సీ-3 గేటు వద్ద గ్యాంగ్‌మన్లను నియమించారు.

ఉదయం నుంచి  సాయంత్రం వరకు ఒకరిని, రాత్రి నుంచి ఉదయం వరకు ఒకరిని గేట్ల వద్ద కాపలా ఏర్పాటు చేశారు. గేట్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న గ్యాంగ్‌మన్లు రైలు వచ్చిపోయే సమయంలో జనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. గేటు దాటేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా.. రైల్వే గేటు మీదుగా ఎన్ని వాహనాలు, మనుషులు, పశువులు వెళ్తున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయూ గేట్ల వద్ద రద్దీని పరిశీలించి అక్కడ గేటు ఉంచాలా... లేదా... అనేది రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు