రాష్ట్రానికి రూ. 1,800 కోట్ల కరెన్సీ

3 Dec, 2016 02:57 IST|Sakshi
రాష్ట్రానికి రూ. 1,800 కోట్ల కరెన్సీ
  • రాష్ట్రానికి అన్నీ రెండు వేల నోట్లే పంపిన ఆర్‌బీఐ
  • సాక్షి, హైదరాబాద్: నగదు కొరత తీవ్రమవటంతో రిజర్వు బ్యాంకు తెలంగాణకు రూ.1,800 కోట్ల విలువైన నోట్లు పంపిణీ చేసింది. కానీ చిన్న నోట్లు ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆర్‌బీఐ పట్టించుకోలేదు. మొత్తం రూ.2వేల నోట్లనే పంపించింది. దీంతో రాష్ట్రంలో చిన్ననోట్ల కొరత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్‌బీఐ పంపిణీ చేసిన నోట్లన్నీ గ్రామీణ ప్రాంతాలకే చేరేలా చూడాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కొరతను తీర్చేందుకు కనీసం రూ.5,000 కోట్ల విలువైన నోట్లను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల కిందటే ఆర్‌బీఐకి లేఖ రాసింది.

    రూ.500, రూ.100, అంతకు చిన్న నోట్లు పంపించాలని కోరింది. కానీ నోట్ల కొరతతో ఆర్‌బీఐ రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. మరోవైపు రాష్ట్రానికి ఇప్పటివరకు విడుదల చేసిన రూ.12వేల కోట్లలో 96 శాతం రూ.2వేల నోట్లే ఉన్నాయి. మరోవైపు ఒకటో తేదీ రావటంతో నోట్ల కొరత పెరిగిపోయింది. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, పెన్షన్‌దారులు జీతాలను తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరిగింది.

మరిన్ని వార్తలు