‘తోడేళ్ల ఫలహారం’ బిగుసుకుంటోంది

21 Jan, 2016 02:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి మహబూబునగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పరిహారంలో జరిగిన అవకతవకల ఉచ్చు కొందరు అధికారుల మెడకు బిగుసుకుంటోంది. అక్రమాలకు సంబంధించి సాక్షిలో వరుస కథనాలు రావడంతో అధికారులు నష్టపరిహారం పంపిణీపై అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు రిజర్వాయర్ల పరిధిలో భూ సేకరణ జరుగుతున్న తీరు, నష్టపరిహారం నిర్ధారిస్తున్న విషయంపై అధికారులు దృష్టి సారించారు.

మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కర్వెన రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణలో వెలుగుచూసిన అక్రమాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వ యంత్రాంగం ఇక క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించాకే పంట భూములను రెండు పంటలవిగా నిర్ధారించాలని నిర్ణయిం చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారం నిర్ధారణ చేసుకోవడానికి ఆయాభూములను సంబంధిత పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలున్నా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి క్షేత్రస్థాయి పర్యటనలే చేయలేనట్లు తెలుస్తోంది. దీంతో ఒక పంట భూముల ను రెండు పంటలు పండేవిగా రికార్డుల్లోకి ఎక్కడంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది.

 మరోమారు పరిశీలన
 కర్వెన రిజర్వాయర్ పరిధిలో భూ సేకరణలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి దిద్దుబాటు చర్యలకు కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్రమాలు జరగలేదని వాదించిన వారిలో కొందరు అధికారులు బుధవారం కర్వెన రిజర్వాయర్ పరిధిలో నష్టపరిహారం చెల్లించిన భూముల్లో కొన్నింటిని పరిశీలించారు. వాటిలో ఉన్న బోర్లు పనిచేస్తున్నాయా..లేదా..అవి ఎన్ని ఎకరాలకు నీరందించే సామర్థ్యం కలిగి ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించారు.

భూ సేకరణలో ఎటువంటి అక్రమాలూ జరగని పక్షంలో నష్టపరిహారం చెల్లింపులు జరిగిన భూములను, వాటిలోని బోర్లను క్షేత్రస్థాయి అధికారి తరచితరచి పరిశీలించడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే విధంగా వాస్తవానికి భిన్నంగా రెండు పంటల భూములుగా రికార్డులలో నమోదైన వాటికి సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొందరికి చెల్లించి, తమవి ఎలా ఆపుతారని లబ్ధిదారులు ప్రశ్నిస్తుండడంతో చెల్లింపులను తాత్కాలికంగానే నిలిపివేస్తున్నామని సర్దిచెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

భూ పరిహారం విషయంలో ఇప్పటికే ఆర్డీఓ కొంతమేరకు విచారణ జరపడం.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదించడం తదితర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కొందరు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు