టీపీసీసీలో మనోళ్లకు ప్రాధాన్యం

20 Sep, 2018 13:06 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో జిల్లాకు పెద్ద పీట వేశారు. స్థానిక నేతలకు రెండు కీలక పదవులు కట్టబెట్టారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొడంగల్‌ తాజా, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను టీపీసీసీ స్టాటజీ అండ్‌ ప్లానింగ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ నియమించారు.
 
పార్టీ మారినా.. పోస్టు మారలే.. 
 రేవంత్‌రెడ్డికి ఎట్టకేలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభించింది. ఎంతో ఆర్భాటంగా టీడీపీ నుంచి హస్తం గూటికి చేరిన ఈయనకు ఇప్పటివరకూ ఎలాంటి పదవి ఇవ్వకుండా అధిష్టానం నానుస్తూ వచ్చింది. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే అసలైన సమయంలో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం ఆయన వర్గీయుల్లో ఆనందం నింపింది. ఎన్నికల ప్రచార పర్వంలోనూ రేవంత్‌ కీలకంగా 
మారనున్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగిన ఈయనను కాంగ్రెస్‌లోనూ ఇదే పదవి వరించింది.
   
అనుమానాలకు తెర... 
జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ కీలక నేతలు రేవంత్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు టీపీసీసీలో కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా ఆ పార్టీ అధిష్టానం అనేక అనుమానాలకు తెరదించినట్లయింది. ప్రసాద్‌కుమార్‌ కారెక్కనున్నాడనే పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఇవేవీ పట్టించుకోకుండా కీలక పోస్టు అప్పగించింది. దీంతో అధిష్టానం దృష్టిలో ప్రసాద్‌కుమార్‌కు మంచి స్థానమే ఉందని తేలిపోయింది. రేవంత్‌రెడ్డిని రాజకీయంగా బలహీనం చేసేందుకే కాంగ్రెస్‌ ఆయన్ను చేర్చుకుందని వచ్చి న పుకార్లకు సైతం అధిష్టాన నిర్ణయం జవాబుగా నిలిచింది. ఈ నేపథ్యంలో జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలతో పాటు ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పక్కాగా ముందుకెళ్తోంది.

మరిన్ని వార్తలు