వ్యవ‘సాయం’.. రూ.11 వేల కోట్లు!

14 Jul, 2017 01:16 IST|Sakshi
వ్యవ‘సాయం’.. రూ.11 వేల కోట్లు!

సాగు పెట్టుబడి పథకానికి అవసరమైన నిధులపై స్పష్టత
ముగిసిన వ్యవసాయ శాఖ సర్వే.. సాగుభూమి లెక్కలు పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా అమలు చేయ తలపెట్టిన ‘వ్యవసాయానికి పెట్టుబడి సాయం’పథకానికి ఏటా రూ.11 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్క తేల్చింది. రాష్ట్రం లో 45,46,750 మంది రైతులు 1,23,17,309 ఎకరాల్లో సాగు చేస్తున్నారని సర్వేలో గుర్తించింది.

ఈ లెక్కన ఎకరానికి రూ.8 వేల చొప్పున (ఖరీఫ్‌లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేలు) సుమారుగా రూ.11 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వే నివేదికను రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేయనున్నారు. ఇక వచ్చే నెలలో రైతులతో సమావేశం కానున్నారు.

విస్తృతంగా సర్వే..
రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు, ఆర్థికంగా భరోసా కల్పించేందు కోసం సాగుకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.4 వేల చొప్పున ఏటా రూ.8 వేల సహాయం అందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో పల్లెపల్లెనా సాగు భూమి ఎంత ఉంది, మొత్తం రైతులు ఎంత మంది తదితర అంశాలపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సాగు భూముల సర్వే చేయించింది.

మే 16న మొదలైన ఆ సర్వే జూన్‌ 15తోనే ముగిసింది. అయితే పెట్టుబడి సాయం పొందేందుకు రైతులంతా విధిగా సర్వేలో తమ భూముల వివరాలను నమోదు చేసుకోవాలంటూ జూలై మొదటి వారం వరకు గడువు పొడిగించింది. ఆ గడువు కూడా ఇటీవల ముగియడంతో.. వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల నుంచి సర్వే గణాంకాలను తెప్పించి క్రోడీకరించింది. మొత్తంగా రాష్ట్రంలో 45.46 లక్షల మంది రైతులున్నారని.. 1.23 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారని అందులో వెల్లడైంది.

తేలాల్సిన భూములు 12 శాతం
సర్వేలో వివరాలు నమోదు చేయని భూములు మరో 12 శాతం ఉన్నాయి. భూ తగాదాలు, ఫిర్యాదులు, ఒకే భూమికి సంబంధించి ఇద్దరు ముగ్గురు రైతులు వివరాలివ్వటం వంటి కారణాలతో పలు భూముల వివరాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటికి సంబంధించి వాస్తవాలను పరిశీలించాక సర్వేలో పొందుపరుస్తామంటున్నారు.

సాగుభూముల సర్వే వివరాలివీ
రైతుల సంఖ్య:      45,46,750
సాగు భూమి: 1,23,17,309 ఎకరాలు
ఇంకా తేలాల్సిన భూములు: 12 శాతం


మేలో సగం.. అక్టోబర్‌లో సగం
ఈ పథకం కింద ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మే నెలాఖరులోగా రూ.4 వేలు, రబీ సీజన్‌కు సంబంధించి అక్టోబర్‌ తొలి వారంలోగా మరో రూ.4 వేలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో రైతులందరి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ఇప్పటికే లెక్కతేలిన సాగు విస్తీర్ణం ప్రకారం ఎకరానికి రూ.8 వేల చొప్పున రూ.9,840 కోట్లు అవసరం. కానీ వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని.. ఇంకా సర్వేలో నమోదుకాని భూములను కూడా కలిపితే దాదాపు రూ.11 వేల కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

మరిన్ని వార్తలు