రవాణా కార్మికులకు రూ.5 లక్షల బీమా

14 May, 2015 01:25 IST|Sakshi

హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల ఉప కార్మిక కమిషనర్లు
సాక్షి, హైదరాబాద్: రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు తమ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 12 రూపాయలు చెల్లిస్తే ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల కార్మికశాఖ ఉప కమిషనర్లు పి.శ్రీనివాస్, ఇ.హనుమంతరావు, ఎస్.నరేశ్ కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ మేడే రోజు నుంచి ఈ బీమా పథకం అమల్లోకి వచ్చిందన్నారు.

ప్రమాదవశాత్తు మృతి చెందితే ఐదు లక్షల రూపాయలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. దీనికి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల ట్రాన్స్‌పోర్టు కార్మికులు, డ్రైవర్లు అర్హులని అన్నారు. ఈ పథకంపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16వ తేదీన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ట్రేడ్ యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు కార్మికులు టోల్‌ఫ్రీ నంబర్ 180030708787కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
 

మరిన్ని వార్తలు