బెంగళూరుపై ‘పంజా’బ్ | Sakshi
Sakshi News home page

బెంగళూరుపై ‘పంజా’బ్

Published Thu, May 14 2015 1:03 AM

బెంగళూరుపై ‘పంజా’బ్

అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షో    
రాణించిన సాహా  
కింగ్స్ ఎలెవన్‌కు ఊరట విజయం

 
వరుస విజయాలతో ప్లే ఆఫ్‌కు చేరువైన దశలో బెంగళూరుకు భంగపాటు ఎదురైంది. తాము రేసునుంచి నిష్ర్కమించినా ఇతర జట్లను దెబ్బ తీస్తామని హెచ్చరించిన పంజాబ్ కెప్టెన్ బెయిలీ తొలి దెబ్బ కోహ్లి సేనపైనే వేశాడు. ఏడు పరాజయాల తర్వాత పంజాబ్‌కు ఊరటనిచ్చే విజయం దక్కగా... ఇప్పుడు బెంగళూరు కాస్త ఇబ్బందికర స్థితికి చేరింది. ఇక ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సిందే.
 
 మొహాలీ : వర్షం బారిన పడిన మ్యాచ్‌లో బెంగళూరుకు అనూహ్య పరాజయం ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 22 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను పదేసి ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

ఓపెనర్‌గా వచ్చిన వృద్ధిమాన్ సాహా (12 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ (2/12), యజువేంద్ర చహల్ (2/25) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆర్‌సీబీ జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. అక్షర్ పటేల్‌కు 2 వికెట్లు దక్కాయి.

 సాహా మెరుపు ఇన్నింగ్స్
 పది ఓవర్ల మ్యాచ్‌కు తగినట్లుగానే పంజాబ్ ఇన్నింగ్స్‌కు సాహా ఘనారంభం అందించాడు. స్టార్క్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతను, అరవింద్ వేసిన రెండో ఓవర్లో మరింతగా చెలరేగిపోయాడు. సాహా మూడు ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. అయితే వీస్ వేసిన మూడో ఓవర్ తొలి బంతిని గాల్లోకి లేపి అతను అవుటయ్యాడు. వీస్ ఈ ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు. నాలుగో ఓవర్లో అరవింద్ మరో 11 పరుగులు ఇచ్చాడు.

అయితే ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ బ్యాటింగ్ తడబడింది. హర్షల్ పటేల్ వేసిన తొలి ఓవర్ ఆ జట్టును దెబ్బ తీసింది. రెండు బంతుల తేడాతో పటేల్ రెండు వికెట్లు తీసి బెంగళూరుకు సంతోషం పంచాడు. భారీ షాట్లు ఆడబోయి వోహ్రా (11), మ్యాక్స్‌వెల్ (10) డీప్‌లో ఫీల్డర్లకు చిక్కారు. తర్వాతి ఓవర్లో స్పిన్‌తో బెంగళూరు దెబ్బ కొట్టింది. లెగ్‌స్పిన్నర్ చహల్ వేసిన తొలి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదిన మిల్లర్ (4 బంతుల్లో 14; 2 సిక్సర్లు) అదే ఓవర్లో స్టంపౌటై వెనుదిరిగాడు.

వీస్ వేసిన ఏడో ఓవర్లో 13 పరుగులు వచ్చినా... తర్వాత హర్షల్ పటేల్ ఐదు పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఆ వెంటనే బెయిలీ (13)ని చహల్ బౌల్డ్ చేయగా... మరో వైపు అక్షర్ పటేల్ (15 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రం కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్లో స్టార్క్ 6 పరుగులే ఇవ్వడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 106 పరుగుల వద్దే ముగిసింది.

 సమష్టిగా వైఫల్యం
 లక్ష్యఛేదనలో బెంగళూరుకు గేల్ (17) మెరుపు ఆరంభం అందించాడు. సందీప్ వేసిన తొలి ఓవర్లో తనదైన శైలిలో భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన అతను మరో ఫోర్ కొట్టడంతో పది పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌ను కట్టుదిట్టంగా బౌల్ చేసిన హెన్‌డ్రిక్స్ ఆరు పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో చెలరేగిన కోహ్లి (9 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరులో అవుటయ్యాడు. అనురీత్ వేసిన ఈ ఓవర్లో  2 ఫోర్లు, 1 సిక్స్ సహా 16 పరుగులు రాబట్టిన అతను చివరి బంతికి షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డయ్యాడు.

అనంతరం రిషి ధావన్ చక్కటి బౌలింగ్‌తో ఆరు పరుగులే ఇవ్వడంతో బెంగళూరు కాస్త ఒత్తిడిలో పడింది. ఈ సారి సందీప్ చక్కటి బంతితో గేల్‌ను బోల్తా కొట్టించాడు. బౌన్సర్‌ను ఆడబోయిన గేల్, కీపర్ చేతికి చిక్కాడు. కొద్ది సేపటికే అక్షర్ పటేల్, ఆర్‌సీబీకి షాక్ ఇచ్చాడు. తనదైన శైలిలో ఫైన్ లెగ్ మీదుగా స్వీప్ ఆడబోయిన డివిలియర్స్ (10) సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కార్తీక్ (2) విఫలం కాగా, కొద్ది సేపు పోరాడిన మన్‌దీప్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా అక్షర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో బెంగళూరు ఆశలు సన్నగిల్లాయి. హెన్‌డ్రిక్స్ (1/9) పొదుపైన బౌలింగ్ కూడా పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
 
 స్కోరు వివరాలు
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ : సాహా (సి) మన్‌దీప్ (బి) వీస్ 31; వోహ్రా (సి) మన్‌దీప్ (బి) హర్షల్ పటేల్ 11; మ్యాక్స్‌వెల్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 10; మిల్లర్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చహల్ 14; బెయిలీ (బి) చహల్ 13; అక్షర్ పటేల్ (నాటౌట్) 20; గుర్‌కీరత్ (సి) కార్తీక్ (బి) స్టార్క్ 2; రిషి ధావన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (10 ఓవర్లలో 6 వికెట్లకు) 106.
 వికెట్ల పతనం : 1-34; 2-50; 3-54; 4-71; 5-99; 6-102.   
 బౌలింగ్ : స్టార్క్ 2-0-20-1; అరవింద్ 2-0-31-0; వీస్ 2-0-17-1; హర్షల్ పటేల్ 2-0-12-2; చహల్ 2-0-25-2.  

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి) సాహా (బి) సందీప్ 11; కోహ్లి (బి) అనురీత్ 19; డివిలియర్స్ (సి) హెన్‌డ్రిక్స్ (బి) అక్షర్ పటేల్ 10; మన్‌దీప్ (సి) మిల్లర్ (బి) పటేల్ 20; కార్తీక్ (సి) మిల్లర్ (బి) హెన్‌డ్రిక్స్ 2; సర్ఫరాజ్ (సి) హెన్‌డ్రిక్స్ (బి) అనురీత్ 4; వీస్ (నాటౌట్) 4; హర్షల్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (10 ఓవర్లలో 6 వికెట్లకు) 84.  
 వికెట్ల పతనం : 1-33; 2-44; 3-67; 4-74; 5-77; 6-83.
 బౌలింగ్ : సందీప్ 2-0-20-1; హెన్‌డ్రిక్స్ 2-0-9-1; అనురీత్ 2-0-21-2; రిషి ధావన్ 2-0-18-0; అక్షర్ పటేల్ 2-0-11-2.

Advertisement

తప్పక చదవండి

Advertisement