ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

25 Oct, 2019 11:06 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : ఆర్టీసీలో మరో గుండె ఆగింది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన జమీల్‌కు గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు.  గత 20 రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న ఆయన నల్లగొండలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే మానసిక ఒత్తిడికి లోనై ఆయన చనిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో.. 11 గంటలకు ఆల్ పార్టీ నేతలతో ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్‌ తీరుకు నిరసనగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ రోజు భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

హైదరాబాద్ : సమ్మె చేసు​న్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై రెండు నివేదికలు సిద్ధం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలపై సమగ్ర వివరాలను రూపొందించి ఒక నివేదికను కోర్టుకు అందించనున్నారు. ప్రతి అంశానికి సంబంధించి రెండు రకాల సమాధానాలను అధికారులు సిద్ధం చేశారు. ఆర్టీసీకి అద్దె బస్సుల అవసరంపై కూడా అధికారులు ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌ను కలిసి ఈడీల కమిటీ అందజేయనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు