కాఫీ జీవితాన్నిమార్చేసింది!

25 Oct, 2019 11:07 IST|Sakshi

‘పారాక్సిమల్‌ డిస్‌కైనేజియా’కు కెఫిన్‌తో కళ్లెం  

జన్యు సంబంధమైన వ్యాధికి అద్భుత చికిత్స  

సీడీఎఫ్‌డీ సైంటిస్ట్‌ డాక్టర్‌ అశ్విన్‌ దలాల్‌ పరిశోధనలో వెల్లడి   

ఉప్పల్‌: ఓ కప్పు కాఫీ తాగితే కాస్తంత ఉత్తేజం కలుగుతుంది.. మనసు రిలాక్స్‌ అవుతుంది... అప్పటి వరకు అనుభవించిన ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది.. కానీ జన్యుపరమైన రోగాలను నయంచేసే శక్తి కాఫీకి ఉందా అంటే అవునని చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన  సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ డయాగ్నొస్టిక్స్(సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్తలు. ఆ సంస్థలో స్టాఫ్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అశ్విన్‌ దలాల్‌  ఈ  విషయాన్ని పరిశోధనాత్మకంగా నిరూపించారు. ‘పారాక్సిమల్‌ డిస్‌కైనేజియా’ అనే జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి  ముప్పూటలా కాఫీ ఇవ్వడం ద్వారా ఆ జబ్బు నుంచి విముక్తి కల్పించినట్టు  గురువారం సీడీఎఫ్‌డీలో నిర్వహించిన ఓపెన్‌డే సందర్భంగా వెల్లడించారు. ఈ జబ్బు ఉన్న వ్యక్తుల్లో  అకస్మాత్తుగా కాలు, చేయి కదులుతుంది. దాంతో వారు ఏ పనీ చేయలేరు. స్థిరంగా ఉండడం సాధ్యం కాదు, డ్రైవింగ్‌ వంటివి కూడా చేయలేరు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంలో  వైద్యనిపుణులు సైతం ఎటూ  తేల్చలేకపోయారు. దీంతో ఇది ఒక అంతుచిక్కని వ్యాధిగానే ఉండిపోయింది. ఈ వ్యాధిపై పరిశోధన చేసిన డాక్టర్‌ అశ్విన్‌ దలాల్‌ బృందం ‘ మెదడులో ఎడినోసిన్‌ రసాయన చర్యలు బాగా పెరగడం వల్ల ఇలా అకస్మాత్తుగా చేయి, కాలు కదలడం అనే పారాక్సిమల్‌ డిస్‌కైనేజియాకు గురవుతున్నారని గుర్తించారు. దీనికి కాఫీలోని కెఫిన్‌ ఒక బలమైన ప్రత్యర్థిగా పనిచేసి  ఎడినోసిన్‌ రసాయన చర్యను నియంత్రించగలిగినట్లు’ తమ పరిశోధనల్లో తేల్చారు. 

పరిశోధన సాగింది ఇలా....
వంశపారపర్యంగా వచ్చే కొన్ని రకాల వ్యాధులకు మందులు లేవని, మూలాలను కనిపెట్టడానికి ఎన్నో రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుందని డాక్టర్‌ అశ్విన్‌ తెలిపారు. ‘‘ ఓ యువకుడు బెంగుళూరులోని న్యూరాలజీ ఆస్పత్రికి వైద్య పరీక్షలకు వచ్చారు.  డాక్టర్‌ కుల్దీప్‌శెట్టి, డాక్టర్‌ ఎస్‌జె.పాటిల్‌  అతడికి పరీక్షలు చేశారు. ఆ వ్యక్తి  ఉన్నట్టుండి అసంకల్పితంగా చేతులు గాలిలోకి ఆడించడం, నొసటిని చిట్లించడం, సైగలు చేయడం లాంటివి చేసేవాడు. ఈ వ్యాధి అతడికి 5వ ఏట నుంచే సంక్రమించింది. పరీక్షల అనంతరం  దీనిని జన్యుపరమైన వ్యాధిని  పారాక్సిమల్‌ డిస్‌కైనేజియాగా గుర్తించారు. సదరు యువకుడు ప్రతిరోజు 10 నుంచి 15 సార్లు ఇలా అసంకల్పిత చర్యలు చేసేవాడు. దీంతో ఆయన తన జీవితంలో చాలా కోల్పోవలసి వచ్చింది. ఆటలు ఆడలేడు, నడవలేడు. వ్యాయామం చేయలేడు. కనీçసం ఈత కొట్టలేడు. ఈ వ్యాధిలో 12 రకాల జన్యువులు ఇమిడి ఉంటాయి. పరీక్షలు చేయాలంటే ఎన్నో జీన్స్‌ను గుర్తించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే తమ బృందం దీనిని జన్యుపరమైన వ్యాధిగా గుర్తించిందని డాక్టర్‌ అశ్విన్‌ చెప్పారు.దీనికి ఎన్నో రకాల మందులు ఇచ్చినప్పటికీ నయం కాలేదన్నారు. ఇండియాలో ఈ జీన్‌ను అంతం చేసే మెడిసిన్‌ లేదని నిరాశ చెందారు. కానీ ఈ ఏడాది జూన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తల  బృందం తల్లీకూతురు ఇదే సమస్యతో బాధపడుతూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాఫీ తాగడం వల్ల  అనుకోకుండానే వ్యాధి తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. కాఫీలో ఉండే కెఫిన్‌ ఆధారంగా ఈ జబ్బు తగ్గుముఖం పట్టిందని మన శాస్త్రవేత్తలు కాఫీ మీద దృష్టి సారించారు. ఫ్రాన్స్‌ అనుభవాన్ని తమ దగ్గరకు వచ్చిన పేషెంట్‌ విషయంలో అమలు చేసి సక్సెస్‌ అయినట్లుగా డాక్టర్‌ అశ్విన్‌ వివరించారు. కాఫీ  అందించిన కొద్ది రోజుల్లోనే   90 శాతం వరకు అతనిలో ఉన్న అసంకల్పిత చర్యను తగ్గించగలిగినట్లు  తెలిపారు. ‘‘ఎంతో  క్లిష్టమైన ఈ సమస్యను రోజూ తాగే కాఫీతో  తగ్గించడం తమకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది.’’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  ‘కొన్ని సంవత్సరాల తరువాత రోగుల ముఖాల్లో నవ్వులు చూడగలుగుతున్నాం.’ అని సంతృప్తిని వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు