పోటాపోటీగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు

13 May, 2015 02:56 IST|Sakshi
పోటాపోటీగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు

కార్మిక శాఖ సహాయక కమిషనర్‌కు, అంబేద్కర్ విగ్రహానికి టీఎంయూ వినతి
{పొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకుల వినతిపత్రం

 
హన్మకొండ :  ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ రీజియన్‌లో యూనియన్లుగా విడిపోయి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం ఏడో రోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఒంటరిగా, ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, బహుజన కార్మిక సమాఖ్య జేఏసీగా నిరసన కార్యక్రవలు నిర్వహించారు. ఈ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు మౌన ప్రదర్శనగా ర్యాలీ తీశారు. ఆర్టీసీ రీజినల్ జేఏసీలోని ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, బహుజన కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికులు హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హన్మకొండలోని ఏకశిల పార్కు వరకు మౌనప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. సీఎంకేసీఆర్,మంత్రులు, ఆర్టీసీ యాజమాన్యంలో మార్పు తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆయూ సంఘాల నాయకులు వెంకన్న, బి.వీరన్న, ఎన్.రాజయ్య, చింత రాంచందర్, బి.రఘువీర్, సి.హెచ్.యాకస్వామి, ఎన్.కొమురయ్య, కృష్ణ, సోము, శేఖర్ పాల్గొన్నారు.
 
టీఎంయూ ఆధ్వర్యంలో..

తెలంగాణ మజ్దూర్ యూనియన్ హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన జరిపి కార్మిక శాఖ సహాయ కమిషనర్ మొగిలయ్యకు వినతిపత్రం అందించారు. తమ వేతన సవరణ 2013 ఏప్రిల్‌తో ముగిసిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు వేతన సవరణ చేయకుండా యాజమాన్యం తమను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, దీంతో తాము సమ్మె చేయాల్సి వచ్చిందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం కార్మిక శాఖ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం, ఆర్టీసీ యా జమాన్యం మనసు మార్చాలని కోరుతూ వినతిపత్రం అం దించారు. కార్యక్రమంలో టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, కార్యదర్శి ఈఎస్ బాబు, ఎం.డీ.గౌస్, ఆర్.సాంబయ్య,జి.సత్తయ్య, ఎస్‌ఆర్‌కుమార్, ఆర్.వి.గోపాల్, రవీందర్, పాషా, జోషి, కె.ఎస్.కుమార్ పాల్గొన్నారు.
 
డిపోలకే పరిమితమైన బస్సులు


హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో బస్సులు 7వ రోజు బుధవారం డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులంతా సమ్మెలో ఉండటంతో బస్సులు బయటికి వెళ్లలేదు. 56 మంది తాత్కాలిక డ్రైవర్లు విధులకు హాజరుకావడంతో 56 ఆర్టీసీ బస్సులు, 194 అద్దె బస్సులు తిరిగాయి. ఏడో రోజు కూడా ఆర్టీసీ జిల్లాలో రూ.కోటి ఆదాయాన్ని కోల్పోయింది.

నేడు ఆర్‌ఎం కార్యాలయం ముట్టడి

సమ్మెలో భాగంగా బుధవారం హన్మకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు టీఎంయూ రీజినల్ కార్యదర్శి ఈఎస్ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఈదురు వెంకన్న తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు