ఆర్టీసీ సమ్మె: జేఏసీ నేతల కీలక నిర్ణయం

7 Oct, 2019 09:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు.  పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్తు కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  మరోవైపు సీఎం కేసీఆర్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది.  ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపేది లేదని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. పండగ సమయంలో సమ్మెకు దిగి ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన తప్పిదం చేశారన్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని ఉద్యోగులను తిరిగి తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని ఆర్టీసీ  జేఏసీ స్పష్టంచేసింది. తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్తామంటోంది.  తాము జీతాల కోసం సమ్మె చేయడం లేదని...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నామని అన్నారు.

>
మరిన్ని వార్తలు