రూపాయి 8 నెలల కనిష్టం

20 Nov, 2014 01:02 IST|Sakshi
రూపాయి 8 నెలల కనిష్టం

ముంబై: డాలరుతో మారకంలో వరుసగా ఐదో రోజు నష్టపోయిన రూపాయి ఎనిమిదిన్నర నెలల కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 22 పైసలు బలహీనపడి 61.96 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు నష్టపోవడం, దిగుమతిదారుల నుంచి డాలరుకి డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలు రూపాయిని దెబ్బకొట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. విదే శీ పెట్టుబడులు మందగించడం కూడా ఇందుకు జతకలిసినట్లు తెలిపారు. వెరసి ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్రితం ముగింపు 61.70తో పోలిస్తే 61.80 వద్ద బలహీనంగా మొదలైంది. ఆపై ఒక దశలో 61.78 వరకూ బలపడింది.

 చివరికి 0.4% నష్టంతో 61.96  వద్ద ముగిసింది. 2014 మార్చి 3 తరువాత రూపాయికి ఇదే కనిష్టస్థాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడింగ్‌లో డాలరు స్థిరంగా ట్రేడవుతోంది. అక్టోబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టిన పాలసీ సమీక్ష వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో డాలరు బలాన్ని పుంజుకోవడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు