ఆ రోజుల్లో చెబితే వినేవారు: మున్సిపల్‌ చైర్మన్‌

7 Jan, 2020 09:40 IST|Sakshi

సాక్షి, భెంసా: భైంసా మున్సిపాలిటీలో రెండుసార్లు చైర్మన్‌గా పనిచేసిన దిగంబర్‌ మాశెట్టివార్‌ ఆ నాటి జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. ఓ సారి ప్రత్యక్ష చైర్మన్‌ ఎన్నికల్లో మరోసారి పరోక్ష ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. 

సాక్షి: మున్సిపల్‌ సమావేశాలు ఎలా నిర్వహించేవారు. 
దిగంబర్‌ మాశెట్టివార్‌: మున్సిపల్‌ సమావేశాల్లో కౌన్సిలర్లంతా తమ అభిప్రాయాలను వెల్లడించేవారు. అందరి ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకునేవారు. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో పట్టణాన్ని అభివృద్ధి చేశాం. 

సాక్షి: అధికారుల స్పందన ఎలా ఉండేది?
దిగంబర్‌ మాశెట్టివార్‌: అప్పట్లో అధికారులు బాగానే సహకరించేవారు. సిబ్బంది తక్కువగా ఉన్నా సమయం ఎక్కువగా కేటాయించి అన్ని పనులు పూర్తి చేసేవారు. మున్సిపల్‌ కార్యాలయం కిసాన్‌గల్లిలోని బాలికల పాఠశాల పక్కనే ఉండేది. కౌన్సిలర్లు, అధికారులు ఎక్కువ సమ యం బల్దియాలోనే ఉండేవారు. 

సాక్షి: ప్రజా సమస్యలు మీ దృష్టికి వస్తే ఎలాంటి చర్యలు తీసుకునేవారు?
దిగంబర్‌ మాశెట్టివార్‌:  ప్రజలు సమస్యలు చెబితే వాటి పరిష్కారానికి వెంటనే అధికారులకు నివేధించేవాళ్లం. సమస్య ఉన్న చోటకు వెళ్లి పరిస్థితిని తెలుసుకునేవాళ్లం. నేను 1947–48 ప్రాంతంలో  
మూడవ తరగతిలో ఉండగా ఉర్ధూ నేర్చుకున్నాను. ఎక్కడికి వెళ్లిన ఉర్ధూలో మాట్లాడేవాడిని. ఆ సమయంలో చాలా వరకు ఉర్ధూలోనే సమస్యలపై రాసి ఇచ్చేవారు. వాటిని నేను చదివి పరిష్కరించేవాడిని. 

సాక్షి: అప్పటి,  ఇప్పటి పరిస్థితులు ఏంటి?
దిగంబర్‌ మాశెట్టివార్‌: అప్ప ట్లో పెద్దలు చెబితే వినే ఆలోచన ఉండేది. ఒకసారి చెబితే అంతా శ్రద్ధగా వినేవారు. ఎదురు చెప్పేవారు చాలా తక్కువ. ఇప్పుడైతే నా దృష్టిలో అలాంటి పరిస్థితులు లేవు. ఎవరికి నచ్చిన విధంగా వారు నడుచుకుంటున్నారు. అభివృద్ధి విషయంలో అంతా కట్టుబడి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. 

మరిన్ని వార్తలు