ఆ ఐదు రోజులు మరచిపోలేను..

25 Sep, 2019 09:26 IST|Sakshi

కాజీపేట తహసీల్దార్‌

కాజీపేట అర్బన్‌ : జిల్లాలోని కాజీపేట మండలంలోని కడిపికొండ, న్యూశాయంపేటకు చెందిన 14 మందితోపాటు జనగామ జిల్లా చిన్న పెండ్యాలకు చెందిన ఓ యువకుడు మొత్తం పదిహేను మంది పాపికొండల విహార యాత్ర కు వెళ్లి అక్కడ బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు సురక్షితంగా బయటపడగా.. మిగతా వారు గల్లంతయ్యారు. ఆ తర్వాత గాలింపుల్లో ఏడుగురి మృతదేహాలు లభించినా ఇంకా ముగ్గురి ఆచూకీ తేలలేదు.

ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్లిన బృందంలో కాజీపేట తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు ఉన్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉన్న అధికారుల బృందం మృతదేహాల ఆచూకీ కోసం జరిగిన గాలింపు చర్యల్లో పాల్గొనడంతో పాటు బాధిత కుటుంబాలకు సమచారం ఇస్తూ, ఓదార్చారు. ఇటీవలే రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన అక్కడి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు తహసీల్దార్‌ మాటల్లోనే...

హుటాహుటిన సంఘటనా స్థలానికి..
పాపికొండలు టూర్‌కు వెళ్లిన జిల్లా వాసులు తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపాన గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ఘ టన గత ఆదివారం(ఈనెల 15వ తేదీన) మ ధ్యాహ్నం 1.15 గంటలకు జరిగింది. ఈ మేరకు సమాచారం మాకు సాయంత్రం 4 గంటలకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక వాహనంలో కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.అజయ్, ఆర్‌ఐ సురేందర్, వీఆర్వో జోసెఫ్‌తో కలిసి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట నుండి బయలుదేరాం. సుమారు 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు రాజమండ్రికి చేరుకున్నాం. త్వరగా వెళ్లాలనే తపనతో కేవలం ఒంటి మీద బట్టలతోనే వెళ్లాం. అక్కడకు వెళ్లాకే మా అవసరాలు గుర్తుకొచ్చాయి. దుస్తులు, సబ్బులు, టూత్‌పేస్ట్‌ తదితర వస్తువులన్నీ అక్కడే కొనుగోలు చేశాం.

మంత్రులు, ఎమ్మెల్యేల ఏరియల్‌ సర్వే
కచ్చులూరు సమీపంలో బోటు బోల్తా పడగా తె లంగాణ వాసులు చిక్కుకున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పు వ్వాడ అజయ్, వరంగల్‌ ఎంపీ పసునూరి ద యాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ కూడా వచ్చారు. అక్కడ ఘటనా స్థలం వద్ద ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బాధితులకు భరోసానందిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు.

శుక్రవారం రాత్రి వెనక్కి..
ప్రమాదంలో గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ గురు, శుక్రవారం వరకు కూడా లభించలేదు. దీంతో ఇక్కడి మండల ప్రజలకు సేవలందించడంలో అవాంతరాలు ఎదురుకాకుండా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి బయలుదేరాం. శనివారం ఇక్కడకు చేరుకున్నాం.

మరిచిపోలేని ఘటన
కలెక్టర్‌ ఆదేశాలతో రాజమండ్రికి వెళ్లిన మేం గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు సంఘటన స్ధలానికి దగ్గరలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సేవలందించాం. ఓ పక్క సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బాధితులకు సమాచారం ఇచ్చాం. మృతదేహాలను ఘటనా స్థలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం బ్యారేజి, 120 కిలోమీటర్ల దూరంలోని యానాంలో రెస్క్యూటీం బృందాలు గుర్తించాయి.

ఆ వెంటనే మృతులు బంధువులతో మాట్లాడడంతో పాటు ఆధార్‌కార్డు, బోటులో ప్రయాణం ప్రారంభించే సమయంలో దిగిన సెల్ఫీలతో గుర్తుపట్టేందుకు బయలుదేరాం. ఆ సమయంలో బంధువుల ఆర్తనాదాలు, మావారి ఆచూకీ చెప్పండయ్యా అంటూ కాళ్ల మీద పడి రోదిస్తుండడం కలిచివేసింది. మృతదేహాలను గుర్తుపట్టాక బంధువులు రోదించిన తీరు మాకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ఆ ఐదు రోజులు తిండి సైతం మరిచిపోయి బాధితుల కోసం పడిన కష్టం మరిచిపోలేను. ఇదంతా జరిగిన పది రోజులు కావొస్తున్నా బాధితుల ఆర్తనాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి.

నా బ్యాచ్‌మేట్‌ సహకారంతో....
నేను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లగా రాజమండ్రి అర్బన్‌ తహసీల్దార్‌గా నా స్నేహితుడు సుస్వాగత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయనే మాకు బస ఏర్పాటుచేశాడు. అలాగే, అక్కడికి వచ్చిన బాధితుల బంధువులకు రాజమండ్రిలోని రత్న హోటల్‌లో వసతి ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించాడు. కాగా, నేను తహసీల్దార్‌గా ఆరేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. నా పరిధిలోని ఒకే గ్రామానికి చెందిన 14 మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఎప్పుడూ జరగలేదు. 

14 మంది వివరాలు పంపించాం..
ప్రమాదం జరిగిన రోజు బోటులో ప్రయాణించిన కడిపికొండ, న్యూశాయంపేట, చిన్నపెండ్యాలకు చెందిన 14 మంది బాధితులు, మృతులు, ఆచూకీ లభించని వారి పూర్తి వివరాలను రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి మంగళవారం పంపించాం. అలాగే, వారి బంధువుల వివరాలు, ఆధార్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్ల వివరాలను సమర్పించాం. ఆ వివరాల ఆధారంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం అందనుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా