ఉద్యోగులకు వరం ఎస్‌జీఎస్‌పీ

21 Dec, 2017 14:16 IST|Sakshi

ఏటీఎం నుంచి ఎన్నిసార్లైనా నగదు డ్రా చేయవచ్చు

ఖాతాలో డబ్బు లేకున్నా.. రెండు నెలల వేతనం అడ్వాన్సుగా పొందవచ్చు  

రూ.20 లక్షల వరకు ఉచిత బీమా సదుపాయం

బొంరాస్‌పేట(కొడంగల్‌):  ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటివరకు స్టేట్‌ బ్యాంకులో ఉన్న జీతాల పొదుపు ఖాతాను వివిధ ప్రయోజనాల కోసం స్టేట్‌ గవర్నమెంట్‌ సాలరీ ప్యాకేజ్‌ (ఎస్‌జీఎస్‌పీ) విధానానికి మార్చుకునే అవకాశం కల్పించింది. ఈమేరకు స్టేట్‌ బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ మార్పుతో ఇతర సాధారణ ఖాతాదారులకంటే మెరుగైన సేవలు, అదనపు సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా అమలులోకి వచ్చిన ఎస్‌జీఎస్‌పీ విధానాలపై అవగాహన ఉంటే ఈ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. జిల్లాలో దాదాపు 3,600మంది ఉపాధ్యాయులు, మరో 2,500 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరంతా తమ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు అందుకుంటున్నారు. వీటిని సాలరీ ప్యాకేజీ అకౌంట్లుగా మార్పుచేసుకునేందుకు తమ జీతాలు అందుకునే బ్యాంకుల్లో ఎస్‌జీఎస్‌పీ విధానం పలురకాల ప్రయోజనాలు అందిస్తోంది.

ప్యాకేజీ ప్రయోజనాలు..

స్టేట్‌ గవర్నమెంట్‌ సాలరీ ప్యాకేజీ(ఎస్‌జీఎస్‌పీ) ఖాతా కిందకు మారితే ఖాతాదారులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో కనీసం రూ.500 నుంచి రూ.2 వేలు ఉండాలన్న నిబంధన ఉంది. ఎస్‌జీఎస్‌పీ విధానంలో జీరో బ్యాలెన్స్‌ ఉన్నా ఎటువంటి నష్టం ఉండదు.

ఏటీఎంలో నగదు డ్రా చేయడానికి ఇటీవల బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. పరిమికి మించి డ్రా చేస్తే చార్జీలు వసూలు చేస్తున్నాయి. సాలరీ ప్యాకేజీలో ఎన్ని పర్యాయాలైనా ఏటీఎం నుంచి నగదు డ్రా చేయవచ్చు.

వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇందుకు రుణం తీసుకున్న సమయంలోనే ప్రీమియం వసూలు చేస్తారు. కొత్త విధానంలో ప్రీమియం లేకుండా ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తారు. అలాగే విమాన ప్రయాణంలో చనిపోతే రూ.30 లక్షలు చెల్లిస్తారు.

వ్యక్తిగత, గృహ, విద్యారుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి బ్యాంకు అధికారులు ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు  చేస్తుండగా.. ఈ ఖాతా కలిగి ఉన్న వారికి ఫీజులో 50శాతం రాయితీ అభిస్తుంది.

బ్యాంకుల్లో బంగారం, డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులు దాచుకునేందుకు తీసుకున్న లాకర్‌ సౌకర్యం చార్జీల్లో 25శాతం రాయితీ ఉంటుంది.

డిమాండ్‌ డ్రాఫ్ట్‌(డీడీ)లకు ఎస్‌జీఎస్‌పీ ఖాతాదారులకు ఎటువంటి చార్జీల వసూలు ఉండదు.

ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నగదు లేకున్నా, వారికి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పిస్తారు. రెండు నెలల శాలరీని ఈ ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోయినా తీసుకోవచ్చు. తీసుకున్న ఓవర్‌ డ్రాఫ్ట్‌ను నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌జీఎస్‌పీ ఖాతాదారులకు రూ.20లక్షల వరకు ఉచితంగా బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

వేతనాల స్థాయి ఆధారంగా ప్యాకేజీలు
 ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాము ప్రతినెల తీసుకుంటున్న వేతనాల ఆధారంగా సాలరీ ప్యాకేజీ అకౌంట్లను కేటాయిస్తుంది. ఉద్యోగులందరికీ ఒకే రకమైన అకౌంటు కాకుండా జీతం స్థాయికి అనుగుణంగా వివిధ విభాగాలుగా విభజించారు.

జీతం ఆధారంగా అకౌంట్‌  
రూ.5వేల నుంచి రూ.20వేల జీతం తీసుకునే ఉద్యోగులకు సిల్వర్‌ అకౌంట్లు, రూ.20వేల నుంచి రూ.50వేల మధ్య జీతం తీసుకునే ఉద్యోగులకు గోల్డ్‌ అకౌంట్లు, రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జీతాలు పొందుతున్న వారివి డైమండ్‌ అకౌంట్లుగా, రూ.లక్షకు పైగా జీతాలు పొందుతున్న ఉద్యోగుల అకౌంట్లను ప్లాటినం అకౌంట్లుగా వ్యవహరిస్తారు.

ప్యాకేజీ పొందే విధానం
జీతం అందుకునే ఖాతా ఉన్న బ్యాంకులో అందుకు కావల్సిన వివరాలు, పత్రాలు, గుర్తింపుకార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్సులు, ఆ నెలలో తీసుకున్న జీతపు బిల్లులను దరఖాస్తుతో జతచేసి బ్యాంకు మేనేజరుకు అందివ్వాలి.

మేనేజరు పరిశీలించి సంతకంతో ధ్రువీకరిస్తారు.

ధ్రువీకరణ పూర్తయిన ఫారాన్ని సంబంధిత కౌంటరులో ఇవ్వాలి.

అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో అకౌంటును ఎస్‌జీఎస్‌పీ పద్ధతిలోకి మార్పు చేస్తారు.

ఎస్‌జీఎస్‌పీ పద్ధతిలోకి మార్పు అయిన విషయాన్ని ఆన్‌లైన్‌లోనూ తెలుసుకోవచ్చు.

ఎస్‌జీఎస్‌పీలోకి మారిన తర్వాత ఏటీఎం కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలి. కార్డు (జీతం స్థాయిని బట్టి సిల్వర్‌/గోల్డ్‌/డైమండ్‌/ప్లాటినం పేరుతో) అందుతుంది. దీనిద్వారా పరిమితిలేని డ్రాలు, ప్రయోజనాలు పొందవచ్చు.

అనేక ప్రయోజనాలున్నాయి
నేను జీతం పొందే బ్యాంకు ఖాతాను రెండు నెలల క్రితం ఎస్‌జీఎస్‌పీ విధానంలోకి మార్చుకున్నా. నా నెలసరి జీతాన్ని బట్టి నాకు ‘గోల్డెన్‌ అకౌంట్‌’ కార్డు వచ్చింది. రోజువారీ పరిమితికి మించినన్ని సార్లు టీఎంకార్డును వినియోగించుకుంటున్నా. ఎలాంటి చార్జీలు కట్‌ కావడంలేదు. ఎస్‌బీఐలో ప్రకటించిన ఎస్‌జీఎస్‌పీ విధానంతో ఉద్యోగులకు అనేక ప్రయోనాలున్నాయి. ఎస్‌బీఐ అధికారులు ఈ ప్యాకేజీ అకౌంట్లపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలి.  
– క్రాంతికుమార్, టీఎస్‌ సీపీఎస్‌ఈయూ, జిల్లా సహాయ కార్యదర్శి, కొడంగల్‌

మరిన్ని వార్తలు