రెండో దశ..నిరాశ

2 Apr, 2019 07:39 IST|Sakshi

పట్టాలెక్కని రెండో దశ ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఐదేళ్లుగా నత్తనడకన పనులు

పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

రైల్వేస్టేషన్లలో సదుపాయాలు కరువు

ఇప్పటికీ పలు స్టేషన్లకు రోడ్డు కనెక్టివిటీ నిల్‌..

సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు ప్రహసనంగా మారాయి. ఐదేళ్లుగా కొనసాగుతున్న పనులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పనులు పూర్తయిన మార్గాల్లో రైళ్లు పట్టాలెక్కలేదు. రెండో దశ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి 2013లో ప్రారంభించే వరకు, తర్వాత పనులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలొచ్చాయి. ఏడాదికోసారి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రైల్‌ నిలయంలో పార్లమెంట్‌ సభ్యుల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ ప్రాజెక్టు మాత్రం నత్తనడకనే సాగుతుండడం నేతల అంకితభావానికి అద్దం పడుతోంది. రెండో దశ రైళ్లను పట్టాలెక్కించేస్తామని రెండేళ్ల క్రితం అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు.

ఆరు మార్గాల్లో చేపట్టిన పనులను దశలవారీగా పూర్తిచేసి గత డిసెంబర్‌ నాటికి  ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ మరో డిసెంబర్‌ వచ్చినా రెండో దశ ఎంఎంటీఎస్‌ ఎక్కడా కనిపించనే లేదు. ఆర్టీసీ తర్వాత ప్రజా రవాణాలో కీలకమైన ప్రాజెక్టుగా భావించే ఎంఎంటీఎస్‌పై కమ్ముకున్న నిర్లక్ష్యపు నీడలు తొలగిపోవడం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లోనూ ఈ ప్రాజెక్టుకు స్థానం లభించడం లేదు. చివరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ప్రసంగాల్లోనూ  ఈ ప్రాజెక్టు పత్తా లేదు. హైదరాబాద్‌లో ప్రజారవాణా విస్తరణకు మెట్రో రైల్‌ను ఏకైక మార్గంగా భావిస్తున్నారు. కానీ నగర శివార్లను అనుసంధానం చేస్తూ అనూహ్యంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాన్ని అందజేసే ముఖ్యమైన ప్రాజెక్టు ఎంఎంటీఎస్‌ మాత్రమే.  

ఎన్నో ఏళ్లుగా అదే నిర్లక్ష్యం..
పటాన్‌చెరు, ఘట్కేసర్, మేడ్చల్, ఉందానగర్, శంషాబాద్‌ తదితర నగర శివార్లను కలుపుతూ ఎంఎంటీఎస్‌ రెండో దశను రూపొందించారు. చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు  తెల్లాపూర్‌ నుంచి రామచంద్రాపురం వరకు 5.75 కి.మీ, బొల్లారం–మేడ్చల్‌ (14 కి.మీ) మాత్రం పూర్తయ్యాయి. బొల్లారం–సికింద్రాబాద్‌ మధ్య రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు కూడా పూర్తి చేసి రైళ్లు నడిపేందుకు అనుకూలమేనని సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ రెండు మార్గాలు మినహాయించి మిగతా మౌలాలీ–ఘట్కేసర్, సనత్‌నగర్‌–మౌలాలి, ఫలక్‌నుమా–ఉందానగర్‌ తదితర మార్గాల్లో పనులు సాగుతునే ఉన్నాయి. సుమారు రెండేళ్ల పాటు  పెండింగ్‌లో ఉన్న మౌలాలి– సనత్‌నగర్‌ మార్గంలో  రక్షణశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇటీవల  పరిష్కారం లభించింది. కానీ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఈ రూట్‌లో డిఫెన్స్‌ భూముల్లోంచి మూడు కి.మీ మేర రైల్వేలైన్లను వేయాల్సి ఉంది. రక్షణశాఖ అధికారులు అడ్డుకోవడంతో రెండేళ్ల క్రితం పనులు నిలిచిపోయాయి. సుమారు రూ.850 కోట్ల అంచనాతో 2012లో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను తర్వాత ఏడాదికి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అడ్డంకులతో సాగుతున్నాయి. మొత్తం 88.05 కి.మీ మేర రెండో దశ కింద చేపట్టారు. 

కనీస సదుపాయాలు లేని స్టేషన్లు  
ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్న ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, నాంపల్లి–సికింద్రాబాద్‌  మార్గాల్లోని 26 స్టేషన్లలో చాలా వరకు రోడ్డు కనెక్టివిటీ, సిటీ బస్సు సదుపాయం లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ మార్గాల్లో ప్రతిరోజు 121 సర్వీసులు సడుస్తున్నాయి. లక్షా 50 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. లింగంపల్లి, హైటెక్‌సిటీ, బేగంపేట్, సికింద్రాబాద్, కాచిగూడ, విద్యానగర్, నాంపల్లి వంటి కొన్ని ప్రధాన స్టేషన్లు మినహాయించి మిగతా స్టేషన్లకు సిటీ బస్సు సదుపాయం లేదు. ట్రైన్‌ దిగిన ప్రయాణికులు కనీసం రెండు కి.మీ నడిస్తే తప్ప బస్సులు లభించని పరిస్థితి. దీంతో ప్రయాణికులు ఆటోడ్రైవర్ల దోపిడీకి గురవుతున్నారు. కేవలం రూ.8 తో 30 కి.మీ. ఎంఎంటీఎస్‌లో ప్రయాణం చేసినవారు మరో 2 కి.మీ. కోసం రూ.50 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఫలక్‌నుమా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, సీతాఫల్‌మండి, బోరబండ, హఫీజ్‌పేట్, మల్కాజిగిరి తదితర స్టేషన్లకు రోడ్డు కనెక్టివిటీ అంతంత మాత్రమే కావడం సమస్యగా మారింది. ఇక వేసవిలో స్టేషన్లలో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్‌నీర్‌ లభించడం లేదు. నల్లాల్లో నీరు రాదు. మరోవైపు స్వచ్ఛరైల్, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాలు రైల్వే స్టేషన్లను వెక్కిరిస్తున్నాయి.

ప్రత్యేక లైన్‌ లేకపోవడంతో సమస్య
ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకల్లోనూ జాప్యం ప్రయాణికుల పాలిట పెద్ద శాపం. రైళ్లు నడిచేందుకు ప్రత్యేకమైన లైన్‌ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్లు నడిచే మార్గాల్లోనే వీటిని నడుపుతున్నారు. దీంతో ఎక్స్‌ప్రెస్, మెయిల్‌ సర్వీసులు వచ్చి వెళ్లే వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్లాట్‌ఫామ్‌లపైనే నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కొన్నిసార్లు సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేయడం పెద్ద శాతంగా మారింది. 2003లో ఎంఎంటీఎస్‌ను ప్రారంభించినప్పుడు ఈ రైళ్ల కోసం ఒక ప్రత్యేక లైన్‌ ఉండాలని ప్రతిపాదించారు. 2019 నాటికి కూడా అలాంటి లైన్‌ ఒకటి నిర్మాణం కాకపోవడం గమనార్హం.

రెండో దశ ప్రాజెక్టు ఇదీ..
మౌలాలి–ఘట్కేసర్‌ 12.20 కి.మీ
ఫలక్‌నుమా–ఉందానగర్‌–ఎయిర్‌పోర్టు 20 కి.మీ
బొల్లారం–మేడ్చల్‌ 14 కి.మీ
సనత్‌నగర్‌–మౌలాలి 22.10 కి.మీ  
తెల్లాపూర్‌ –రామచంద్రాపురం  5.75 కి.మీ
మౌలాలి–సీతాఫల్‌మండి 10 కి.మీ   మొత్తం రూట్‌ పొడవు 88.05 కి.మీ 

మరిన్ని వార్తలు