పాత్రికేయ ప్రముఖుడు ‘పొత్తూరి’ అస్తమయం

6 Mar, 2020 01:58 IST|Sakshi

అనారోగ్యంతో కన్నుమూతమహాప్రస్థానంలో అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌: విలువలతో కూడిన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంతో పాటు చివరి శ్వాస వరకు పౌరహక్కులు, బలహీనుల పక్షాన నిలిచిన సీనియర్‌ జర్నలిస్టు, ఏపీ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాసబ్‌ట్యాంక్‌ విజయనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఆయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు మూడు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య సత్యవాణి, కుమారులు ప్రేమ్‌గోపాల్, రహీ ప్రకాష్, కుమార్తెలు వాత్సల్య, డాక్టర్‌ పద్మజ ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు మాసబ్‌ట్యాంక్‌ విజయనగర్‌ కాలనీలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆయనకు కుమారుడు గోపాల్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం
గుంటూరు జిల్లా పొత్తూరులో 1934 ఫిబ్రవరి 8న జన్మించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. 1957లో తన సమీప బంధువైన బీవీ రాజు సారథ్యంలో వెలువడిన ఆంధ్రజనత పత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, ఉదయం పత్రికల్లో కీలక హోదాల్లో పనిచేశారు. జర్నలిజంలో విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆయన తన అభీష్టానికి భిన్నంగా ఓ పత్రిక యాజమాన్యం ఒక వార్తను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సంపాదక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2005లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లోనూ పొత్తూరి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన వ్యాసప్రభ, చింతన, నాటి పత్రికలు–మేటి విలువలు తదితర పుస్తకాలతో పాటు ‘విధి నా సారథి’ పేరుతో ఆత్మకథను రాశారు.

పొత్తూరి ఓ మైలురాయి : గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 
సాక్షి, అమరావతి: సీనియర్‌ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం సంతాపం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా సమాజానికి సేవలందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు పాత్రికేయరంగంలో మైలురాయి వంటివారని పేర్కొన్నారు.

పత్రికారంగంలో పొత్తూరి సేవలు ఎనలేనివి: సీఎం వైఎస్‌ జగన్‌
సీనియర్‌ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పాత్రికేయరంగంలో పొత్తూరి పాత్ర మరువలేనిదన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐదు దశాబ్ధాలకు పైగా పత్రికా రంగంలో సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు.  పొత్తూరి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ప్రముఖుల సంతాపం
సీనియర్‌ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, కుర్తాళం సిద్దేశ్వరీ పీఠం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి  సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు