నేరెళ్ల ఘటనలో తొలివేటు..

11 Aug, 2017 12:02 IST|Sakshi
నేరెళ్ల ఘటనలో తొలివేటు..

►  సీసీఎస్‌ ఎస్సై రవీందర్‌ సస్పెండ్‌  ఆదినుంచీ వివాదాస్పదుడే..
► ఇల్లంతకుంట నుంచి నేరెళ్ల ఘటన వరకు..

నేరెళ్ల దళితులపై పోలీసుల ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. బాధ్యుడైన సీసీఎస్‌ ఎస్సై బి.రవీందర్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావం తర్వాత శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉండగా.. నేరెళ్ల ఘటనతో అప్రతిష్టపాలైంది. సీసీఎస్‌ ఎస్సై రవీందర్‌ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది.  

సిరిసిల్ల: ఇల్లంతకుంటలో ఎస్సైగా పనిచేసిన సమయంలోనే రవీందర్‌ వివాదాస్పదుడిగా మారాడు. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు. దీంతో అక్కడి మహిళలు ఫిర్యాదు మేరకు అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య విచారణ జరిపి ఎస్పీకి నివేదిక ఇచ్చారు. దీంతో రవీందర్‌ ను లా అండ్‌ ఆర్డర్‌ నుంచి తప్పించి కరీంనగర్‌ ఎస్పీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు.

చొప్పదండిలో పనిచేస్తున్న సమయంలో న్యాయంకోసం ఠాణాకు వచ్చే మహిళల సెల్‌నంబర్లు తీసుకుని రహస్యంగా ఫోన్‌ చేసి వేధించేవాడని అపవాదు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావంతో రవీందర్‌ను జిల్లాకు కేటాయించారు. జిల్లా పోలీస్‌ బాస్‌తో సఖ్యతగా ఉండడంతో టాస్క్‌ఫోర్స్‌ టీంకు పర్యవేక్షకుడిగా నియమించారు.

కొద్దిరోజుల క్రితం నకిలీ బంగారం విక్రయించేవారిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం వెళ్లి.. అక్కడ పోలీసులమని చెప్ప కుండానే.. మిస్‌ఫైర్‌ చేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీస్‌ బాస్‌ అండతో ఉత్సాహంగా పనిచేసిన రవీందర్‌ నేరెళ్ల ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించి.. పోలీస్‌మార్క్‌ను చూపెట్టాడు. అది ఆయన మెడకు చుట్టుకుంది.

ప్రభుత్వానికి తలనొప్పి..: నేరెళ్ల ఘటనలో సిరిసిల్ల పోలీసుల తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. జూలై 2న తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో ఇసుక లారీ ఢీకొని భూమయ్య మరణించిన నాటినుంచి మంత్రి కేటీఆర్‌ వేములవాడకు గోప్యంగా వచ్చి వెళ్లేంతవరకూ సిరిసిల్ల ప్రాంతంలో పోలీసుల తీరు చర్చకు తెరలేపింది. సీఎం కేసీఆర్‌ సహా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి కేటీఆర్‌ నేరెళ్ల ఘటనను సమర్థించే ప్రయత్నం చేశారు. సమస్య జాతీయస్థాయికి వెళ్లే ప్రమాదం సమీపించడంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఎస్సై రవీందర్‌పై తొలివేటు వేశారు.  
 
 

మరిన్ని వార్తలు