నాగు పాము పగ..?!

19 Oct, 2017 12:42 IST|Sakshi

పాము.. నాగు పాము పగ పడుతుందా..? పగబట్టి వెంటాడుతుందా..?  వెంటాడి కాటేస్తుందా..? సామాన్యులు ఔనంటారు. హేతువాదులు కాదంటారు. ఇదంతా ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తారు. అదంతా యాధృచ్ఛికమని హేతువాదులు కొట్టిపారేస్తారు. ఇంతకీ, ఎప్పుడు... ఎక్కడ... ఏం జరిగింది?

టేకులపల్లి: పాములు పగ పడతాయన్నది ఒక వాదన. అదంతా మూఢ నమ్మకమేనన్నది మరో వాదన. దీనిపై చర్చకు ఆస్కారమిస్తున్న ఘటన ఒకటి టేకులపల్లి మండలంలోని కోయగూడెం పంచాయతీ బావోజీతండాలో జరిగింది.

11 రోజుల్లో మూడుసార్లు కాటేసింది
అదొక చిన్న నాగు (తాచు) పాము. 11 రోజుల వ్యవధిలో ఓ యువకుడిని మూడుసార్లు కాటేసింది. సకాలంలో వైద్యం అందడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.
బావోజీతండాకు చెందిన ఆ యువకుడి పేరు అజ్మీర వీరన్న. నిరుపేద వ్యవసాయ రైతు దంపతులైన మంగ్త, మాలి కుమారుడు. ఆరేళ్ల క్రితం కవితతో వివాహమైంది. తండాలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే చిన్న గుడిసెలో వేరుగా వీరన్న–కవిత దంపతులు నివసిస్తున్నారు. టేకులపల్లిలోని కూల్‌ డ్రింక్స్‌ గోడౌన్‌లో వీరన్న పని చేస్తున్నాడు.

ఈ నెల 6న మొదటిసారి...
ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) రాత్రి. అది వీరన్న ఇల్లు. ఇంటి నుంచి బయటకు వెళుతున్నాడు. నాలుగు అడుగులు వేశాడో లేడో.. ఎడమ కాలి కింద మెత్తగా ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ వెంటనే అదే కాలి పాదంపై ఏదో కరిచింది. ఈ రెండూ వెంట వెంటనే.. ఒకే ఒక్క క్షణంలో జరిగాయి. గుడ్డి వెళుతురులో కళ్లు రిక్కించి చూశాడు వీరన్న. అమ్మో.. తాచు పాము! చిన్న సైజులో ఉంది. జరజరా పాక్కుంటూ చీకట్లో మాయమైంది. ఇంటికెళ్లి తన భార్యతో చెప్పాడు. ఇద్దరూ పరిశీలనగా చూశారు. పాదంపై రెండు గాట్లు పడ్డాయి. విషయం తెలుసుకున్న వెంటనే వీరన్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు వచ్చేసరికి నోటి నుంచి నురగతో అతడు కింద పడిపోయాడు. అందరూ కలిసి మండలంలోని సులానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది యాంటీ స్నేక్‌ ఇంజక్షన్‌ వేసి, కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. అక్కడి వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమించిందంటూ స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి పంపించారు. థ్యాంక్‌ గాడ్‌.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆస్పత్రి ఖర్చు రూ.16,000 అయింది.

మరుసటి రోజున మళ్లీ కనిపించింది
మరుసటి రోజు (7వ తేదీన) ఉదయం వీరన్న ఇంటి సమీపంలో చిన్న సైజులోగల నాగు పామును స్థానికులు గమనించారు. చంపేం దుకు ప్రయత్నించడంతో తప్పించుకుని, వీరన్న తల్లిదండ్రుల ఇంటి పక్కనున్న సందులోగల చెట్టు మొట్టు తొర్రలోకి వెళ్లింది. దానిని బయటకు తెచ్చేందుకు గ్రామస్తులు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఈ నెల 13న రెండోసారి...
వీరన్న పూర్తిగా కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాడు. ఈ నెల 13వ తేదీ (శుక్రవారం) రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వీరన్న పాదంపై మళ్లీ పాము కాటు వేసింది. అతడు దిగ్గున లేచాడు. భయంతో చెమటలు పట్టాయి. వెన్నులో వణుకు మొదలైంది. దూరంగా జరజరా పాక్కుంటూ పాము వెళుతోంది. అదే.. అదే పాము..!! 6వ తేదీన తన కాలిపై కాటేసిన తాచు పామే..!!! కొన్నే కొన్ని క్షణాల్లో అతడి నోటి నుంచి నురగ రావడం మొదలైంది. కుటుంబీకులు, స్థానికులు కలిసి వెంటనే కొత్తగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈసారి కూడా ప్రాణాపాయం తప్పింది. ఆస్పత్రి ఖర్చు రూ.23,000 అయింది. 

     అతడి కుటుంబీకుల్లో, స్థానికుల్లో తీవ్ర భయాందోళన మొ దలైంది. అంతకు ముందు పాము దాక్కున్న చెట్టు మొట్టు వద్దకు వెళ్లారు. ఆ పాము అక్కడే ఉండవచ్చేమోనని అనుకున్నారు. దానిని బయటకు రప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఫలితం కనిపించలేదు. భయాందోళన ఇంకా ఎక్కువైంది. మంత్రగాళ్లను ఆశ్రయించారు. 
ఇల్లు మార్చాలని మంత్రగాళ్లు చెప్పారు. దీంతో, వీరన్న దంపతులు ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఎదురుగా ఉన్న (వీరన్న) తల్లిదండ్రుల ఇంటిలో ఉంటున్నారు.

ఈ నెల 16న మూడోసారి...
ఈ నెల 16వ తేదీ (సోమవారం) రాత్రి తొమ్మిది గంటల సమయం. తల్లిదండ్రుల ఇంటిలో నిద్రిస్తున్న వీరన్న పాదంపై మూడోసారి పాము కాటు వేసింది. భయం, వణుకుతో వీరన్నకు ప్రాణం పోయినంత పనయింది. అదే పాము.. నెమ్మదిగా పాక్కుంటూ వెళుతోంది. కొత్తగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందడంతో కోలుకున్నాడు. ఇంటికి తిరిగొచ్చాడు.
   
 ‘నాగు (తాచు) పాము పగ పట్టింది. ఇందులో సందేహం లేదు. ఇల్లు మారిన తరువాత కూడా వెతుక్కుంటూ వచ్చి కాటేయడమే ఇందుకు నిదర్శనం’ అని, వీరన్న దంపతులు.. తల్లిదండ్రులు.. స్థానికులు గట్టిగా నమ్మారు. ఈసారి ఎలాగైనా ఆ పామును చంపాలనుకున్నారు. అందరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటివరకు ఆ పాము ఉదయం, రాత్రి వేళల్లోనే బయటకు వచ్చింది. అందుకే.. ఈ రెండు వేళల్లో ప్రతి ఒక్కరూ వేయి కళ్లతో నిరంతరం.. నిశితంగా పరిశీలిస్తున్నారు.

మాయదారి పాము.. మళ్లీ వచ్చింది
భయపడినట్టుగానే, అనుకున్నట్టుగానే 18వ తేదీ (సోమవరం) బుధవారం ఉదయం ఆ పాము బయటకు వచ్చింది.. వీరన్న తల్లిదండ్రుల ఇంటి వద్దకు చేరింది. అప్పటికే అక్కడ జనం ఉండటంతో తిరిగి చెట్టు మొట్టు తొర్రలోకి వెళ్లిపోయింది. అది అలా వెళ్లడాన్ని అక్కడి జనం గమనించారు. పరుగు పరుగున మొట్టు వద్దకు వెళ్లారు. ఆ పాముని బయటకు రప్పిం చేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఫలి తం కనిపించలేదు. చివరి ప్రయత్నంగా.. ఆ చెట్టు మొట్టు కింద మంట పెట్టారు. సక్సెస్‌..! ఆ పాము బయటకు వచ్చింది..!! ఇన్నాళ్లపాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టి, కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ పామును అందరూ కలిసి కొట్టి చంపారు. పీడ విరగడయిందని అనుకున్నారు. హాయిగా.. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక రోజు ముందుగానే దీపావళి పండగ చేసుకున్నంతగా సంబరపడ్డారు!!

చాలా భయంగా ఉంది
‘‘పాము పగ పడుతుందో లేదో నాకు తెలియదు. కానీ, నన్ను మాత్రం మూడుసార్లు కాటేసింది. వైద్యుల చలవతో బతికి బయటపడ్డాను. ఆస్పత్రి ఖర్చులు 40,000 రూపాయలయ్యాయి. తప్పనిసరి పరిస్థితిలో ఆ పాముని చంపాల్సొచ్చింది. ఎప్పుడేం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది’’. అజ్మీర వీరన్న, పాము కాటు బాధితుడు 

మరిన్ని వార్తలు