రోడ్డుంటే చాలు బస్సు నడపండి

3 Nov, 2016 01:11 IST|Sakshi
రోడ్డుంటే చాలు బస్సు నడపండి

- ఆర్టీసీ అధికారులకు చైర్మన్ సోమారపు దిశానిర్దేశం
- నిర్వహణ వ్యయం దక్కితే చాలు
- నష్టాల పేరుతో బస్సులు రద్దు చేయొద్దు
- ఆక్యుపెన్సీ రేషియో పెంచి లాభాల్లోకి తేవాలి
- రోడ్లు బాగోకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘నష్టాల బూచీ చూపి పల్లెలకు బస్సులు రద్దు చేయటం సరికాదు. బస్సు నిర్వహణ వ్యయం కంటే ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా చాలు.. సిబ్బంది జీతాలను లెక్కించకుండా ఆ మార్గం లో బస్సు నడపండి. రోడ్డు బాగుంటే చాలు బస్సుతో ఆ ఊరిని అనుసంధానం చేయండి’’ అని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు.  రోడ్డు బాగులేని చోట దాన్ని బాగుచేసేలా సంబంధిత విభాగాలకు సూచించి మరీ బస్సులు నడుపుదామని అన్నారు. ‘‘ప్రజలకు బస్సులను అందుబాటులోకి తెచ్చి, ఆక్యుపెన్సీని పెంచటం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావాలి’ అని సూచించారు.   రాష్ట్రంలో 1,341 గ్రామాలకు బస్సులు నడవని తీరు, ఏకంగా మండల కేంద్రాలకూ అందుబాటులో లేని దుస్థితిని వివరిస్తూ వరుసగా రెండ్రోజులపాటు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించారు. బుధవారం ఆర్టీసీ  అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

 అన్ని గ్రామాలను తనిఖీ చేయండి
 డిపో మేనేజర్లు తమ పరిధిలోని అన్ని ఊళ్లను తనిఖీ చేసి, ఏయే గ్రామాలకు బస్సు నడుస్తుందీ, ఏయే పల్లెలకు ఆ వసతి లేదో గుర్తించాలని సత్యనారాయణ పేర్కొన్నారు. అన్ని పల్లెలను ఆర్టీసీతో అనుసంధానించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. రోడ్డు బాగుండి, నిర్వహణ ఖర్చులకు సరిపోయేలా ఆదాయం వచ్చే ఊళ్లకు వెంటనే బస్సులు ప్రారంభించాలన్నారు. అంతకంటే తక్కువ ఆదాయం వచ్చి కనీసం డీజిల్ ఖర్చుకు కూడా సరిపోని పరిస్థితి ఉంటే ఆక్యుపెన్సీ రేషియో పెంచే చర్యలు తీసుకున్న తర్వాత బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరిఖనిలో సిటీబస్సుల అంశాన్ని ఉదహరించారు. ఆ బస్సులు ప్రారంభించిన ప్పుడు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) 20 శాతం వరకే ఉందని, ఇప్పుడు అది 55 శాతానికి చేరుకుందన్నారు. అధికారులు దృష్టి సారిస్తే ఓఆర్ పెరుగుతుందన్నారు. గ్రామాలను ఆర్టీసీతో అనుసంధానించే విషయంలో లాభనష్టాలతో బేరీజు వేసుకోవద్దని, కానీ క్రమంగా వాటిని లాభాల బాట పట్టించే చర్యలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని సూచించారు.

ఆర్టీసీ కార్మికులకు వేతనాలొచ్చాయ్!
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఎట్టకేలకు వేతనాలు విడుదల య్యాయి. అక్టోబర్ నెలకు సంబంధించి వేతనాలను నవంబర్ 1న ఇవ్వకపోవడంతో సంస్థలో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. 1వ తేదీన వేతనాలు చెల్లించలేకపోవటం ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి. సరిపడా నిధులు లేకపోవడంతో నాలుగైదు రోజులు ఆపేసి, రోజువారీ ఆదాయం పోగు చేసి చెల్లించాలని నిర్ణయించారు. దీన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో బుధవారం సాయంత్రం వేతనాల మొత్తాన్ని బ్యాంకు లో జమచేయడంతో కార్మికుల ఖాతాల్లో జీతాలు పడ్డాయి. తక్కువ పడ్డ దాదాపు రూ.30 కోట్ల మొత్తాన్ని అప్పుగా తెచ్చి సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు