మన రైల్వే.. మొత్తం వైఫై

21 Nov, 2019 03:55 IST|Sakshi

దేశంలో రెండో జోన్‌గా రికార్డ్‌... 574 స్టేషన్‌లకు విస్తరించిన సేవలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత వైఫై సేవలు అందించడంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. జోన్‌లోని అన్ని స్టేషన్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలో ఆ ఘనత సాధించిన రెండో జోన్‌గా నిలిచింది. ప్రస్తుతం 574 స్టేషన్లలో ఈ వసతిని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్‌టెల్‌ ఇంటర్నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు.

హాల్టింగ్‌ స్టేషన్‌లు మినహా జోన్‌లోని అన్ని ఏ–1 కేటగిరీ నుంచి ఎఫ్‌ కేటగిరీ స్టేషన్‌ల వరకు హైస్పీడ్‌ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. 2015లో ఈ పనులకు శ్రీకారం చుట్టి నాలుగేళ్ల సమయంలోనే అన్ని స్టేషన్‌లకు విస్తరించటం పట్ల  అధికారులను ఆ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అభినందించారు.

తక్కువ సమయంలో వైఫై సేవలు ప్రారంభించటంలో కీలకపాత్ర పోషించిన అధికారులను  జీఎం గజానన్‌ మాల్యా కూడా ప్రత్యేకంగా అభినందించారు. స్టేషన్‌ పరిధిలోకి వచ్చిన వారు తమ ఫోన్‌ ద్వారా ఉచితంగా వైఫై సేవలు పొందొచ్చు. నిర్ధారిత గడువు పూర్తయ్యాక మళ్లీ లాగిన్‌ అయి సేవలను కొనసాగించుకోవచ్చు. గొల్లపల్లి అనే గ్రామీణ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌ వైఫై ద్వారా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజ్ఞాన సముపార్జనతోపాటు నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారని అధికారులు తెలిపారు.

2015లో ఏ–1 స్టేషన్‌ అయిన సికింద్రాబాద్‌లో ఉచిత వైఫై ప్రారంభించారు. ఇప్పటివరకు 5 ఏ–1 స్టేషన్లు, 31 ఏ కేటగిరీ స్టేషన్లు, 38 బీ కేటగిరీ స్టేషన్లు, 21 సీ కేటగిరీ స్టేషన్లు, 78 డీ కేటగిరీ స్టేషన్లు, 387 ఇ కేటగిరీ స్టేషన్లు, 2 ఎఫ్‌ కేటగిరీ స్టేషన్లు, 12 కొత్త  స్టేషన్‌లలో ఈ  సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు