పాలన లేని పల్లెలేల..!

2 Mar, 2018 04:13 IST|Sakshi

30 శాతం పంచాయతీల్లో కార్యదర్శుల్లేరు

కుంటుపడుతున్న అభివృద్ధి పనులు

4 వేల పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

గ్రామాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌: పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు గ్రామ పంచాయతీలను పునర్‌వ్యవస్థీకరిస్తామంటోంది. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులిస్తామని పేర్కొంటోంది. కానీ పంచాయతీల పాలనలో కీలకమైన గ్రామ కార్యదర్శుల నియామకంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికీ 30 శాతం పంచాయతీల్లో కార్యదర్శుల్లేక ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక రూపకల్పన చేసే, పథకాలు అమలు చేసే నాథుడు లేక పనులు కుంటుపడుతున్నాయి. దీనికితోడు తాజాగా 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతో పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభా వం చూపబోతోంది.

పన్నెండు వేలకు పెరగనున్న పంచాయతీలు   
రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలుండగా.. 5,065 గ్రామ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాలన సౌలభ్యం కోసం పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 5,500 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3,519 మంది కార్యదర్శులే పని చేస్తుండటంతో.. క్లస్టర్లతోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలనూ అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌ శాఖకు ప్రతిపాదనలొచ్చాయి. ప్రతిపాదనలు ఆమోదిస్తే పంచాయతీల సంఖ్య 12,806కు పెరుగుతుంది.

దీంతో సగటున 3, 4 గ్రామాలకు ఒకరు చొప్పున కార్యదర్శిగా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గ్రామాల పాలన ఇబ్బందిగా మారుతుంది. ప్రణాళిక రూపకల్పన, పన్నుల వసూలు, నిధుల ఖర్చు తదితరాలపై ప్రభావం పడే అవకాశముంది. దీంతో ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని, ఖాళీగా ఉన్న గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖలో డిమాండ్‌ వినిపిస్తోంది.  

మరిన్ని వార్తలు