రాణుల పూదోట!

24 Nov, 2017 10:51 IST|Sakshi

డెస్క్‌టాప్‌ గార్డెనింగ్‌లో అద్భుత సృజన

మొక్కలు పెంచండి.. ఆనందం పంచండి    

మీ కలకు కళ జోడిస్తాం: రాణి పూదోట, రాణి నరిశెట్టి  

3సముద్ర అలల తాకిడిలో సేదతీరుతున్న మత్స్యకన్య..   కనుచూపు మేర ఆకుపచ్చని పసరిక, మధ్య మధ్యలో చెట్లు.. తపస్సులో లీనమైన తథాగతుడి ప్రసన్న వదనం.. అందమైన కోట, దాని చుట్టూ తోట.
ఆ తోటలో నీటి కొలను. కొలనుపై చెక్క వంతెన. వంతెన ఆవల పక్షుల గూడు. ఆ పక్షులను పలకరించే యువరాణి.. విశాలమైన ప్రాంగణంలో చక్కటి ఇల్లు, కారు, మనసున మనసై నిలిచిన ఓ ప్రేమజంట. ఇది
మీ కల అయితే.. ఆ కలను తమ కళతో ఓ రూపమిచ్చి మీ ముందుకు తీసుకువస్తారు.

మీ వృత్తిని, ఆసక్తిని, మీ కళ్ల ముందు నిలుపుకోవాలనుకునే కలలను, చిత్రాలను మీరు కోరుకున్నట్లుగా డెస్క్‌టాప్‌ గార్డెన్‌గా మలిచి అందిస్తారు నగరానికి చెందిన రాణి పూదోట, రాణి నరిశెట్టి. మొక్క పెంచితే కలిగే తృప్తిని, ఒత్తిడి నుంచి కలిగే ఉపశమనాన్ని గ్రహించిన వీరు డెస్క్‌టాప్‌ గార్డెనింగ్‌ను వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనుకుంటున్నారు.     

ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకొని పెరిగే గట్టి మొక్కలను మినియేచర్‌ గార్డెనింగ్‌లో వాడతారు. ఆఫీస్‌లో, ఇంట్లో కిటికీ, బాత్‌రూమ్, స్టడీ టేబుల్‌ ఎక్కడైనా వీటిని పెట్టుకోవచ్చు.  వారం పది రోజులు
ఊరు వెళ్లినా బతికే తత్వం ఉన్న గట్టి మొక్కలతోనే ఈ గార్డెన్స్‌ రూపొందిస్తున్నారు. సన్సెవేరియా, గోల్డెన్‌ పాతోస్, అలోవెరా, బ్రయోఫిలం, క్రిప్టాంతస్, జమీయా లాంటి మొక్కలు  తక్కువ నీరు, వెలుతురు, గాలి ఉన్నా బతికేస్తాయి. ఈ మొక్కలు గదిలో గాలిని శుద్ధి చేస్తాయి. రాత్రిళ్లు కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేయవు. 

కలలకు రూపం..
చిన్నపిల్లలు ఫెయిరీ, కార్టూన్‌ క్యారెక్టర్‌లు, మగపిల్లలు ఆటలు, పెద్ద వాళ్లు మెడిటేషన్‌  గులక రాళ్లు కూడా లేకుండా మట్టి మాత్రమే ఉండేలా కావాలని కొందరు, రాధాకృష్ణులు, సంగీతం, ఆటలు, వృత్తులు, సందర్భాలు ఇలా రకరకాల థీంస్‌తో మినియేచర్‌ గార్డెన్‌లు రూపొందిస్తున్నారు. పార్టీల్లో 3, 4 వందల రూపాయల గిఫ్ట్‌ ఇచ్చే బదులు ఈ డెస్క్‌టాప్‌ గార్డెన్స్‌ ఇస్తే బాగుంటుందంటున్నారు రాణి పూదోట, రాణి నరిశెట్టి.   

ఇష్టంగా చేశాం..  నేను గృహిణిని. సైన్సు సబ్జెక్ట్‌ చదువుకున్నా. మొక్కల పెంపకంపై ఆసక్తి. మినియేచర్‌ గార్డెనింగ్‌ సింపుల్‌గా స్టార్ట్‌ చేశాం. కస్టమైజ్డ్‌ గార్డెన్‌ల నుంచి పార్టీ రిటర్న్‌ గిఫ్ట్‌ బల్క్‌ ఆర్డర్ల వరకు చేస్తున్నాం.   – రాణి పూదోట

స్వానుభవంతో..
నేను ఐటీ ఉద్యోగిని. ప్రతి ఉద్యోగంలో, ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్‌ తప్పదు.  నా టేబుల్‌ మీద ఈ చిట్టి గార్డెన్‌ ఉంటుంది. కాసేపు ఈ మొక్కలను చూస్తే ఎంతో రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. మనం పెంచే మొక్కకి ఒక ఆకు, కొమ్మ, పువ్వు వచ్చినా కలిగే ఆనందమే వేరు.  – రాణి నరిశెట్టి

మరిన్ని వార్తలు