ఏటా రూ.100 కోట్ల మందుల దందా

27 Nov, 2014 01:23 IST|Sakshi

- ఐదు జిల్లాలకు విస్తరించిన ‘పెన్సిడిల్’ వ్యాపారం
- గుట్టు విపుతున్న ఔషధ నియంత్రణ అధికారులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బంగ్లాదేశ్‌కు తరలుతున్న దగ్గు మందు (పెన్సిడిల్) వ్యవహారం లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో ఈ దందా కొందరు మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులకు ఏటా వంద కోట్ల రూపాయల ఆదాయం చేకూరుస్తోందని ఔషధ నియంత్రణ అధికారుల విచారణలో తేలుతోంది. ఇతర దేశాలు, రాష్ట్రాలకు డ్రగ్స్ (నిషేధం లేనివి మాత్రమే) సరఫరా చేసేందుకు వీలుగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీ లెసైన్స్ పొంది.. ఐదు జిల్లాల వ్యాపారులతో కలిసి ఈ దందాను నడిపిస్తోంది.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన అజంతా ఏజెన్సీస్ అధినేత సుధాకర్ బాగోతం బయటపడటంతో ఔషధ నియంత్రణ శాఖ నిజామాబాద్‌తోపాటు కరీంనగర్, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలోల ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వెలుగుచూస్తున్న అక్రమ వ్యాపారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఐదు జిల్లాల నుంచి నెలకు మూడు లక్షల బాటిళ్లను రూ.90 ధరకు కొనుగోలు చేసి రూ.200 చొప్పున బంగ్లాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.  
 
మహేందరే కీలక సూత్రధారి
దగ్గు మందు అక్రమ రవాణాకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఐదు జిల్లాలకు చెందిన ఏజెన్సీల నిర్వాహకులు మందును హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన ప్రణిత్ ఫార్మా అధినేత మహేందర్ చేరవేస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారిగా వ్యవహరించాడని అంటున్నారు. ఇతనికి ఐదు జిల్లాలకు చెందిన ఏజెన్సీ అసోసియేషన్ నాయకులతో పరిచయాలు ఉండడంతో దందాను వివిధ జిల్లాలకు  విస్తరించారు. కోట్లాది రూపాయల ఆదాయం రావడంతో ఏజెన్సీలు అక్రమ దందాకు పూనుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు కామారెడ్డి అంజతా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు సుధాకర్ కూడా ఈ వ్వవహారంలో కీలకం గా ఉన్నట్టు అధికారుల విచారణలో తేలింది.
 
త్వరలోనే మరికొందరి బండారం..
రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న దగ్గు మందు అక్రమ వ్యాపారం గుట్టును ఔషధ నియంత్రణ శాఖ విప్పుతోంది. ఇప్పటికే ఐదు జిల్లాల్లో సుమారు 48 మందిని గుర్తించిన ఆ శాఖ మరికొందరి గుట్టు రట్టు చేసే ప్రయత్నంలో ఉంది. మరింత సమాచారం కోసం కూపీ లాగుతున్నారు. అజంతా యజమాని సుధాకర్ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు