ప్రతి గింజా కొంటాం | Sakshi
Sakshi News home page

ప్రతి గింజా కొంటాం

Published Thu, Nov 27 2014 1:13 AM

ప్రతి గింజా కొంటాం

రైతులకు ఇబ్బంది రానివ్వం
డిసెంబర్ 10 నుంచి ధాన్యం కొనుగోళ్లు
డీఎస్‌వో కృష్ణారావు వెల్లడి

 
మచిలీపట్నం : రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని డీఎస్‌వో కృష్ణారావు వెల్లడించారు. రైతులకు ఇబ్బంది రానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన విధానం అమలులోకి తెస్తోంది. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం నుంచి 25 శాతం మాత్రమే ఎఫ్‌సీఐ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. మిగిలిన 75 శాతం మిల్లర్లే బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేసింది. దీంతో స్థానిక  మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి ఈ విధానం మారడంతో మిల్లర్లు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరుపుతారా అనేది రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎంతమేరకు కొనుగోళ్లు జరుగుతాయి, నిబంధనలు ఎలా ఉన్నాయి, కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది ఉన్నారా, గోనె సంచులు సకాలంలో రైతులకు అందిస్తారా, కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటిలోగా నగదు చెల్లింపులు ఉంటాయి తదితర అంశాలపై రైతులకు అనేక అనుమానాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎ.కృష్ణారావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలివీ...

ప్రశ్న : ధాన్యం కొనుగోలులో నూతన విధానంపై రైతుల్లో అయోమయం నెలకొంది?

డీఎస్‌వో : ఏదైనా నూతన విధానం అమలు చేసే సమయంలో కొన్ని అపోహలు ఉండటం సహజం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై రూపొందించిన విధానం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. నూతన విధానం వల్ల బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు గణనీయంగా తగ్గే అవకాశముంది.
 
ప్రశ్న : ధాన్యం మద్దతు ధర ఎంత ?

డీఎస్‌వో : ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1400, కామన్ వెరైటీకి రూ.1360గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం సూచించిన విధంగా ధాన్యం నాణ్యతతో ఉంటే మద్దతు ధర ప్రకారం కొనుగోలు జరుగుతుంది.
 
ప్రశ్న : కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది ఉన్నారా?

డీఎస్‌వో : కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. సాంకేతిక నిపుణులకు ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి బుధవారం నుంచి విజయవాడలోని డీఆర్డీఏ కార్యాలయంలో శిక్షణ ప్రారంభమైంది. 28వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. సమయం వృథా కాకుండా ఐదు సెషన్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. కొనుగోలు కేంద్రాల్లో ఉండే సిబ్బందికి ధాన్యం నాణ్యత పరిశీలన, రికార్డుల నిర్వహణ ఎలా చేయాలనే అంశం పైనా పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తాం.

ప్రశ్న : రైతులకు నగదు చెల్లింపు ఎలా చేస్తారు?

డీఎస్‌వో : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయటం జరుగుతుంది. ధాన్యం అమ్మకం చేసే సమయంలోనే రైతు తన ఆధార్ నంబరును బ్యాంకు ఖాతా ఉన్న ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, పాన్ కార్డు నంబరు కొనుగోలు కేంద్రంలోని సిబ్బందికి ఇవ్వాల్సి ఉంది. ఏ కేంద్రంలో ఎన్ని టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు, ఏ రైతు నుంచి కొనుగోలు చేశారు, నగదు చెల్లింపు జరిగిందా, లేదా తదితర అంశాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచుతాం. దీని కోసం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి ట్యాబ్లెట్ పీసీలు ఇస్తాం.

ప్రశ్న : రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?

డీఎస్‌వో : వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని గ్రహించి ధాన్యాన్ని 17 శాతం తేమ ఉండే వరకు ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. దీనివల్ల రైతులకు, కొనుగోలు కేంద్రంలోని సిబ్బందికి ఇబ్బందులు తగ్గుతాయి. ధాన్యంలో మట్టి బెడ్డలు, తాలు, తప్ప మూడు శాతం కన్నా ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న : గోనెసంచులు సిద్ధంగా ఉన్నాయా ?

డీఎస్‌వో : డిసెంబరు 10లోగా సంచులు సిద్ధం చేయాలని మార్కెటింగ్ శాఖకు బాధ్యతలు అప్పగించాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పరీక్ష చేసే యంత్రాలను సిద్ధం చేయాలని ఇప్పటికే చెప్పటం జరిగింది. మార్కెటింగ్ శాఖ అధికారులు వాటిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.
 ప్రశ్న : గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో 27 వేల టన్నులకు మించి కొనుగోళ్లు జరగలేదు కదా.. ధాన్యం కొనేందుకు

ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

డీఎస్‌వో : గతం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం రైతులు పండించిన ప్రతి గింజా కొనేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. ఏం జరుగుతుందో మీరే చూస్తారు. రైతులను ఎలాంటి ఇబ్బందులూ పడనివ్వం. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై జేసీ జె.మురళి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
 

Advertisement
Advertisement