స్త్రీనిధి రుణం.. మహిళలకు వరం !

10 Dec, 2018 11:24 IST|Sakshi
కాగితరామచంద్రాపురంలో టైలరింగ్‌ నిర్వహించుకుంటున్న రమ

     పొదుపు సంఘాల రుణంతో ఉపాధి పొందుతున్న మహిళలు

     మండలంలో రూ.1.69 కోట్లతో 445 మందికి లబ్ధి 

సాక్షి, నడిగూడెం : పొదుపు సంఘంలో సభ్యులుగా చేరి నెలసరి పొదుపు చేస్తూనే ప్రభుత్వం కల్పించిన స్త్రీ నిధి రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ, సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు పలు గ్రామాల మహిళలు. సంఘం ద్వారా వచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుంటూ నెలసరి పొదుపు పాటిస్తూ ఉపాధి పొందుతున్నారు. 
స్వయం ఉపాధిపై దృష్టి..
మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంజూరైన స్త్రీ నిధి రుణాలతో పలువురు మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. కిరాణం, ఫ్యాన్సీ షాపులు, గొర్రెల పెంపకం, టైలరింగ్, గాజుల షాపులు ఇంకా పలు రంగాలను ఎంచుకొని లబ్ధిపొందుతున్నారు. స్వయం సహయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు చేసిన పొదపు సంఘం నిర్వహణను పరిగణలోకి తీసుకొని సంఘంలోని సభ్యులకు స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేస్తారు. ఒక్కో సంఘం పరిధిలో సభ్యులకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంతో మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగలో యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
రూ. 1.69 కోట్లతో 445 మందికి రుణాలు..
మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్త్రీనిధి పథకం కింద 445 మందికి రూ.1.69 కోట్లు ఇప్పటి వరకు రుణాలు సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందించారు. సకాలంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తే మరికొంత మందికి స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేయనున్నారు. సమభావన సంఘాల మహిళలు క్రమం తప్పకుండా పొదుపు పాటించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. 

టైలరింగ్‌తో ఉపాధి పొందుతున్నా :
 స్త్రీ నిధి కింద రూ.50 వేలు రుణం పొందాను. దీంతో ఆ డబ్బులను వృథా చేయకుండా టైలరింగ్‌ షాపు నిర్వహించుకుంటున్నాను. దీంతో ఉపాధి పొందుతున్నాను. నా కుటుంబానికి ఆసరాగా ఉంది. స్త్రీ నిధి పథకం మాలాంటి మహిళలకు తోడ్పాటునందిస్తుంది.

– కాసర్ల శశిరేఖ, నారాయణపురం  
 పొదుపులు చేసుకుంటున్నాము..
స్త్రీ నిధి పథకం ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నాను. ఆ డబ్బులతో గొర్రెలను పెంచుకుంటున్నాను. తీసుకున్న రుణంలో ఎప్పటికప్పుడు చెల్లించుకుంటున్నాను. అలాగే పొదుపులు కూడా ప్రతి నెలా చేసుకుంటున్నాము.  మాలాంటి వారికి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుంది.

– నూకపంగు సామ్రాజ్యం, వల్లాపురం   

ప్రభుత్వ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి..
స్వయం సహయక సంఘాల కొరకు ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తుంది. సంబంధిత మహిళా సంఘాలు ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.  

– రామలక్ష్మి, ఏపీఎం, గ్రామీణాభివృద్ధి సంస్థ, నడిగూడెం  

మరిన్ని వార్తలు