అంగడి ఆగమాగం

1 Feb, 2019 02:16 IST|Sakshi
నుమాయిష్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బుగ్గి అయిన స్టాల్స్‌.. 

ఆందోళనలతో అట్టుడికిన ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ 

ఎగ్జిబిషన్‌ సొసైటీ పాలకమండలిపై బాధితుల ఆగ్రహం 

మహమూద్‌ అలీ, ఈటల ఘోరావ్‌.. పోలీసుల లాఠీచార్జి 

రూ.60 కోట్ల మేర ఆస్తి నష్టమని అధికారుల అంచనా 

బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేల నగదు, రూ.25 వేల చెక్కు 

నేడు, రేపు నుమాయిష్‌కు సెలవు.. 28 వరకు ఎగ్జిబిషన్‌ పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు బాధితుల ఆగ్రహ జ్వాలలు.. మరోవైపు మిన్నంటిన ఆక్రందనలు, ఆర్త నాదాలు.. ఇంకోవైపు నేతల ఘెరావ్‌లు, ఆందోళనలతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ గురువారం అట్టుడికింది. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులను ఆదుకునేందుకు ఇటు ప్రభుత్వపరంగా, అటు నిర్వాహకుల నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ పాలక మండలి కార్యాలయాన్ని ముట్టడించి, అక్కడున్న పూలకుండీలను ధ్వంసం చేశారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన హోం మంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రి  ఈటెల రాజేందర్‌ సహా ఇతర నేతలను బాధితులు ఘోరావ్‌ చేశారు. వారి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. ఇదే సమయంలో కొంత మంది బాధితులు సొసైటీ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారికి నచ్చజెప్పారు. 


నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ స్టాల్‌లో చెల్లాచెదురుగా పడివున్న వస్తువులు, సగం కాలిన వస్త్రాలు
 

వచ్చే ఏడాది ఉచితంగా స్టాళ్లు... 
బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోని నుమాయిష్‌లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు 300 స్టాళ్లు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు, అగ్నిమాపకశాఖ, క్లూస్‌టీం బృందాలు గురువారం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాల కోసం అన్వేషించాయి. 15 రెవెన్యూ బృందాలు బాధితుల వివరాలు, ఆస్తి నష్టాల వివరాలను సేకరించాయి. 130 మందికి చెందిన 300 స్టాళ్లు దగ్ధం కావడంతో సుమారు రూ.60 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీంతో బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేల నగదుతోపాటు రూ.25వేల చెక్కును అందజేయనున్నట్లు మాజీ మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్‌ ప్రకటించారు. నుమాయిష్‌కు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు ఎగ్జిబిషన్‌ పొడగిస్తున్నట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. షెడ్డులు మళ్లీ ఏర్పాటుచేసి, బాధితులకు ఉచితంగా అందజేయడమే కాకుండా ఆ 14 రోజులపాటు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా బాధితులను ఆదుకునేందుకే కేటాయించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది కూడా వారి నుంచి ఎలాంటి అద్దె వసూలు చేయబోమని స్పష్టంచేశారు. 


ఓ స్టాల్‌లో కాలిపోయిన కరెన్సీ నోట్లు

సేవాభావం నుంచి వ్యాపార ధోరణికి... 
చిరు వ్యాపారులను ఆదుకునేందుకు నిజాం ప్రభువు హైదరాబాద్‌లోని నాంపల్లి మైదానంలో ఏటా ఎగ్జిబిషన్‌ నిర్వహించేవారు. నుమాయిష్‌ దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ కావడంతో ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, సూరత్, ఈశాన్య రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. మొదట్లో ఇది పూర్తిగా సేవాభావంతో పనిచేసేది. ప్రస్తుతం దీన్ని కమర్షియల్‌గా మార్చేశారు. ఒక్కో షాపునకు రూ.70 వేల అద్దె వసూలు చేస్తుండటంతో యజమానులు వాటిని మరో ఇద్దరు ముగ్గురు వ్యాపారులకు సబ్‌లీజుకు ఇస్తున్నారు. చివరకు మైదానంలోని దేవాలయం చుట్టూ కూడా షాపులు ఏర్పాటు చేశారు. పైగా వాటి మధ్య కనీసం గ్యాప్‌ కూడా వదిలిపెట్టలేదు. మరోవైపు షాపుల ముందు ఫైర్‌ సేఫ్టీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అంతే కాకుండా ఒకే విద్యుత్‌ వైరు నుంచి అనేక షాపులకు కనెక్షన్లు ఇచ్చారు. నాసిరకం కేబుళ్లు వాడటం, అనేకచోట్ల జాయింట్లతోపాటు లూజ్‌ కనెక్షన్లు ఉన్నాయని చెప్పినా విద్యుత్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. 


ఆందోళన చేస్తున్న స్టాళ్ల యజమానులు

 
కళ్ల ముందే బూడిదయ్యాయి 
నాలుగైదేళ్ల నుంచి నుమాయిష్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నా. పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నా. షాపులో రూ.10 లక్షలకుపైగా విలువైన మెటిరీయల్‌ ఉంటుంది. వస్త్రాలు అమ్మగా వచ్చిన రూ.48వేల నగదు కూడా కౌంటర్లోనే ఉంది. ఒంటిపై ఉన్న బంగారం కుదువపెట్టి, ఫైనాన్స్‌ నుంచి అప్పు తీసుకుని మెటిరీయల్‌ కొన్నా. సంపాదించిన నగదు సహా అన్నీ కళ్ల ముందే కాలిబూడిదయ్యాయి. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – ఆర్తి, హైదరాబాద్‌ 
 
భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను 
పదిహేనేళ్ల నుంచే నుమాయిష్‌లో పాల్గొంటున్నా. రూ.70వేలు చెల్లించి స్టాల్‌ అద్దెకు తీసుకున్నా. రూ.20 లక్షలు ఖర్చుచేసి ఖరీదైన సిల్క్, ఇతర డ్రెస్‌ మెటిరీయల్‌ తెప్పించాను. అంతా కళ్లముందే కాలి బూడిదైపోయింది. భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను. కట్టుకునేందుకు బట్టలే కాదు, కనీసం తినేందుకు తిండి కూడా లేదు. – మునాఫ్‌ ఆలం, బిహార్‌ 
 
తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు 
సూరత్‌లో ఓ వ్యాపారి వద్ద నా భార్య నగలన్నీ కుదవపెట్టి సరుకు తెచ్చాను. మరికొంత బంధువుల వద్ద అప్పు కూడా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు సరుకు అమ్మగా వచ్చిన నగదు కూడా కౌంటర్‌లోనే ఉంది. మెటీరీయల్‌తో పాటు నగదు కూడా కాలిపోయింది. తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు. – ఉమేష్, గుజరాత్‌ 
 
అన్నీ కాలిపోయాయి 
30 ఏళ్ల నుంచి స్టాల్‌ ఏర్పాటు చేస్తున్నా. అన్నీ చేనేత వస్తువులే. అప్పు చేసి మెటీరియల్‌ కొన్నా. ఈ ఏడాది వ్యాపారం కూడా అంతగా లేదు. 95 శాతం సరుకు స్టాల్లోనే ఉండిపోయింది. ఆ రోజు వచ్చిన నగదు సహా అన్నీ కాలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.  – రత్నమాణిక్యం, నర్సాపూర్‌ 
 
ఫైరింజన్లో నీళ్లు లేవు 
తాగేందుకు నీరు లేదు. బాత్‌రూమ్‌లూ బాగోలేదు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పాలకమండలి ఘోరంగా విఫలమైంది. దీనిపై 2018లోనే ఫిర్యాదు చేశాను. కానీ ఎవ్వరూ పట్టించుకోకపోగా, బ్లాక్‌ మెయిల్‌ చేశారు. అద్దె చెల్లించినా.. అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫోన్‌ చేసిన వెంటనే ఫైర్‌ ఇంజన్‌ వచ్చినప్పటికీ.. అటు ఇటూ తిరిగిందే కానీ మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదు. అందులో నీళ్లు కూడా లేవు.  – సబిత, గుజరాత్‌ 
 
స్టాళ్ల మధ్య గ్యాప్‌ లేకపోవడం వల్లే ప్రమాదం 
గతంలో స్టాల్‌కు స్టాల్‌ మధ్య గ్యాప్‌ ఉండేది. ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆర్పేందుకు మైదానానికి నాలుగు వైపులా నాలుగు ఫైర్‌ ఇంజన్లు ఉండేవి. స్టాల్స్‌ ముందు ఫైర్‌సేప్టీ కూడా ఉండేది. ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేయలేదు. అందువల్లే ఇంత భారీ ప్రమాదం చోటుచేసుకుంది.  – మహ్మద్‌ అశ్రత్, జమ్ముకాశ్మీర్‌   


సమావేశంలో మాట్లాడుతున్న ఈటల 

బాధితులను ఆదుకుంటాం: ఈటల 
హైదరాబాద్‌: నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మాజీమంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 79 ఏళ్ల నుమాయిష్‌ చరిత్రలో ఇంతపెద్ద ప్రమాదం జరగలేదన్నారు. ఘటనలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు, క్లూస్‌ టీంలు వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు. అలాగే నష్టం వివరాలను అంచనా వేస్తున్నామన్నారు. ప్రమాద వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడించారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రైవేటు, వ్యాపార సంస్థ కాదని.. గొప్ప ఆశయం కోసం ఇది ఏర్పాటైందని తెలిపారు. ప్రైవేటు సంస్థలను డిమాండ్‌ చేసినట్లుగా సొసైటీని డిమాండ్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఎగ్జిబిషన్‌ ఏర్పాటులో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రతలు తీసుకుంటామని స్పష్టంచేశారు. స్టాల్‌కు స్టాల్‌కు మధ్య స్థలం ఉండేలా చూస్తామని, స్టాళ్లను కట్టెలతో కాకుండా ఇనుముతో నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రతి షాప్‌ వద్ద ఫైర్‌సేఫ్టీ సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్లు, స్టౌవ్‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. షాపు యజమానులు స్టాల్స్‌కు బీమా తీసుకోవాలని.. ఈ విషయంలో సొసైటీ తరపున రాయితీ కల్పిస్తామని ఈటల తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా