‘డబుల్’... ఆచరణలో ట్రబుల్

1 May, 2015 01:21 IST|Sakshi

  రాజీవ్ ఆవాస్ యోజన(రే)
  అమలులో రాష్ట్రం నిర్లక్ష్యం
  డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం పేర కాలయాపన
  రెండేళ్లుగా మూలుగుతున్న రూ.70 కోట్ల నిధులు
  వాటిని వెనక్కి ఇచ్చేయాలని కేంద్రం ఘాటు లేఖ

 
హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్‌ల పేరుతో రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్‌ఏవై/రే) అమలులో నిర్లక్ష్యంపై కేంద్రం సీరియస్ అయింది. కేంద్రం మంజూరు చేసిన సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను ‘డబుల్ బెడ్ రూమ్’లుగా నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కాలయాపనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిం ది. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ  ఘాటుగా లేఖ రాసింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రానికి మంజూరు చేసిన ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేస్తామంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటుకు ఉపక్రమించింది.


రాష్ట్ర విభజనతో పాటు పరిపాలనపర అనుమతుల జారీలో ఆలస్యం, రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం విడుదల కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తదితర కారణాలతో ఈ పథకం అమలులో జాప్యం జరిగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా కేంద్రానికి వివరణ ఇచ్చుకుంది. ఇదే అంశంపై పట్టణ గృహనిర్మాణ మంత్రిత్వశాఖ కార్యదర్శి తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య అధికారితో ఫోన్‌లో మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేశారు.


ఆది నుంచే అలక్ష్యం: పట్టణ ప్రాంత మురికి వాడల నిర్మూలన కోసం గత యూపీఏ ప్రభుత్వం 2009-10లో ఆర్‌ఏవైను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎంపికై ‘మిషన్ నగరాల్లో’ని మురికి వాడల్లో రెండు, మూడంతస్తుల(జీ+2, జీ+3) గృహ సముదాయాలనకు నిర్మించడంతో పాటు మౌలిక సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడిచిన మూడేళ్లలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణకు 7 ఆర్‌ఏవై ప్రాజెక్టులు మంజూరయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేశవ్‌నగర్‌లో 334 ఇళ్ల నిర్మాణానికి రూ.58.74 కోట్లతో మంజూరైన ప్రాజెక్టు మాత్రమే కార్యరూపం దాల్చింది.


వరంగల్, ఖమ్మం, రామగుండం పట్టణాలకు మంజూరైన మిగిలిన 6 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు పురోగతి లేదు. ఏడు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ వాటా రూ.161.56 కోట్ల నుంచి తొలి విడత కింద గత రెండేళ్లలో విడుదలైన రూ.70 కోట్లు నిరుపయోగమయ్యాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కింద సైతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించడం తో ఈ పథకం అమలు ఆలస్యమైంది.  


విడుదల కాని రాష్ట్ర వాటా నిధులు
ఆర్‌ఏవై కింద రాష్ట్రానికి 4 ప్రాజెక్టులు మంజూ రై రెండేళ్లైనా ఇంకా ఇళ్ల నిర్మాణం పట్టాలెక్కలేదు. ప్రాజెక్టు మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటికయ్యే వ్యయంలో కేంద్రం 75 శాతం, రాష్ట్రం 15 శాతం, పురపాలక సంస్థ 10 శాతం నిధులివ్వాలి. కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో రూ. 70 కోట్లు విడుదల చేయగా, రాష్ట్రం తమ వాటా నిధులను విడుదల చేయలేదు.

>
మరిన్ని వార్తలు