దోపిడీదారులను అడ్డుకునే దమ్ముందా?

28 Sep, 2014 00:19 IST|Sakshi
దోపిడీదారులను అడ్డుకునే దమ్ముందా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మల్లు స్వరాజ్యం సవాల్
 హైదరాబాద్‌లో జరిగిన ఐద్వా తెలంగాణ మహాసభ


హైదరాబాద్ : ‘నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి, నాటి వీర తెలంగాణ పోరాటానికి నక్కకు- నాక లోకానికి ఉన్న తేడా ఉంది. ఆనాటి పోరాటంలో మేం దోపిడీదారులకు ముకుతాడు వేశాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే ప్రజలను దోచుకుంటున్న నేటి దోపిడీదారులను నిర్మూలించాలి’ అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభ శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్, మల్లు స్వరాజ్యం హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది కమ్యూనిస్టులేనని, రాజకీయ నాయకులకు దమ్ముంటే తనతో గాని, ప్రజా ఉద్యమ కారులతో గాని డబ్బుల్లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. ప్రధాని మోదీది మనువాదమా..? మానవతా వాదమా.. తేల్చుకోవాలన్నారు.

ప్రధాని మోదీ మహిళల సంక్షేమం కోరుకునే వాడైతే పార్లమెంట్‌లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. దళితులకు మాత్రమే భూమి పంపిణీ చేస్తామని చెప్తున్న  కేసీఆర్ .. దళితులు మిగతా బలహీన వర్గాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్మతి మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పిన నరేంద్రమోదీ ఆహార భద్రత, ఐసీడీఎస్, ఉపాధి హామీ పథకాలపై సరైన దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి, రాష్ట్ర అధ్యక్షురాలు బి.హైమావతి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు