వారంతా మట్టిలో కలిసిపోయారు | Sakshi
Sakshi News home page

వారంతా మట్టిలో కలిసిపోయారు

Published Sun, Sep 28 2014 12:18 AM

వారంతా మట్టిలో కలిసిపోయారు - Sakshi

- సామ్నాలో సేన విమర్శనాస్త్రం
ముంబై: మాజీ మిత్రుడు బీజేపీపై శివసేన విమర్శలు రోజు రోజుకూ పదునెక్కుతున్నాయి. హిందూత్వ కోసం నిలిచింది తమ నాయకుడు బాల్ ఠాక్రే మాత్రమేనని, ఇతరులంతా ఆ అంశాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని బీజేపీని ఉద్దేశించి విమర్శించింది. మహారాష్ట్రను స్వాధీనం చేసుకోవాలని వచ్చిన వారందరూ ఇక్కడి మట్టిలో సమాధి అయ్యారని హెచ్చరించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం బాల్ ఠాక్రే అని తెలిపింది. రాష్ట్రంలో అక్టోబర్ 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమని శివసేనశనివారం తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. ‘‘ఔరంగజేబు లేదా అఫ్జల్ ఖాన్, ఎవరైనా సరే స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన వారందరూ ఇక్కడ సమాధి అయ్యారు లేదా అంతరించిపోయారు’’ అని సామ్నా వ్యాఖ్యానించింది.

శివాజీ మహరాజ్ తరువాత బాల్‌ఠాక్రే మాత్రమే ఇక్కడ చరిత్ర సృష్టించారని తెలిపింది. శివాజీ హిందవీ స్వరాజ్యను స్థాపించారని, కానీ ఈ దేశంలో హిందూత్వ జెండాను ఎగురవేయాలని దివంగత శివసేన అధినేత నిర్ణయించారని పేర్కొంది. కొందరు రాజకీయ నాయకులు రామ నామం జపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సామ్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశంలో, మహారాష్ట్రలో హిందూత్వను వ్యాపింపచేయడానికి బాల్ ఠాక్రే ఎన్నో దాడులను ఎదుర్కొన్నారంది.

ఆ ఫలితాలనే నేడు ఢిల్లీ, మహా రాష్ట్రలో చవిచూస్తున్నామని పేర్కొంది. బీజేపీపై విమర్శలు సంధిస్తూ, ఔరంగజేబు ఇక్కడి మరాఠా పాలకులను కూలదోసేందుకు మహారాష్ట్రలో తిష్టవేశాడని, కానీ సఫలం కాలేకపోయాడని వ్యాఖ్యానించింది. జయించాలని వచ్చిన ఔరంగజేబు మట్టికరుచుకుపోయాడని తెలిపింది. మహారాష్ట్ర ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాల కోసం నిలిచిందని, రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వను ఎన్నడూ ప్రయోగించలేదని పేర్కొంది.

Advertisement
Advertisement