అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

30 Sep, 2017 02:03 IST|Sakshi

గొర్రెల అక్రమ రవాణాపై తలసాని సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం, మాడ్గులపల్లి మండలం చెర్కుపల్లి గ్రామం, దామరచర్ల మండలం ఇర్కిగూడెం, సూర్యాపేట జిల్లా మోతె మండలానికి సంబంధించి లబ్ధిదారులకు అందించిన సుమారు 50 యూనిట్ల (1050) గొర్రెలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి తరలిస్తున్నారన్న సమాచారం మంత్రికి అందింది.

వెంటనే మంత్రి నల్లగొండ జిల్లా కలెక్టర్, పశుసంవర్ధకశాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అక్రమంగా గొర్రెలను తరలిస్తున్న 3 బొలేరో, 3 డీసీఎం వాహనాలను నల్లగొండ జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌ చెక్‌పోస్ట్‌ల వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన లబ్ధిదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, పశుసంవర్ధకశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

మరిన్ని వార్తలు