కార్పొరేట్ కారాగారాలు..

10 Nov, 2017 03:19 IST|Sakshi

విద్యార్థులకు నరకం చూపుతున్న బడా కాలేజీలు.. 

హాస్టళ్లలో దారుణ పరిస్థితులు

ఇరుకు గదులు.. పొద్దస్తమానం చదువులు

ఆటల్లేవు.. మానసిక ఉల్లాసం లేదు

తల్లిదండ్రులతో మాట్లాడేందుకూ తిప్పలే

లక్షలు చెల్లిస్తున్నా మౌలిక సదుపాయాలూ కరువే

నిర్బంధ పరిస్థితుల మధ్య ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు

ఒంటరితనంతోనే ఆత్మహత్య ఆలోచనలు!

సాక్షి, హైదరాబాద్‌: అదో కార్పొరేట్‌ కాలేజీ.. కట్టుదిట్టమైన పహారా మధ్య స్టడీ అవర్‌ జరుగుతోంది.. పిల్లలంతా ‘పుస్తక కుస్తీ’లో మునిగిపోయారు.. ఓ విద్యార్థికి అర్జెంట్‌.. కానీ ధైర్యం చేసి అడగలేడు.. కారణం.. అడిగితే ఎక్కడ కొడతారోనన్న భయం! చేసేది లేక ఉగ్గబట్టుకొని అలా కూర్చుండిపోయాడు!! అది పేరుమోసిన మరో బడా కళాశాల.. ప్రాంగణంలోనే హాస్టల్‌.. అమ్మానాన్నను చూసి ఆ విద్యార్థిని రెండు నెలలైంది.. ఫోన్‌లో మాట్లాడాలన్నా సవాలక్ష ఆంక్షలు.. సెలవు రోజు వచ్చింది.. అమ్మానాన్న వచ్చారు.. కానీ ‘రేపు పరీక్షలున్నాయి.. ఇప్పుడు కలవడం కుదరదు’ అంటూ వారిని వెనక్కి పంపేశారు కాలేజీ సిబ్బంది.. దూరంగా ఉన్న కిటికీలోంచి పేరెంట్స్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకొని పుస్తకాలు పట్టుకుంది ఆ అమ్మాయి!! 

ఇంకో కాలేజీ.. అందులో వివేక్‌ ఇంటర్‌ చదువుతున్నాడు.. చదువుల్లో సాధారణ విద్యార్థి.. క్లాస్‌కు వెళ్లగానే ముందురోజు చెప్పిన పాఠంలోని ప్రశ్నలడిగారు లెక్చరర్‌.. ఇంకేముంది.. బెత్తాలు విరిగాయి.. విద్యార్థి చేయిపై వాతలు తేలాయి..!..మార్కులు, ర్యాంకుల గోల తప్ప విద్యార్థులు, ఆటలు పాటలు, వారి సమగ్ర వికాసం పట్టని కార్పొరేట్‌ కాలేజీలు, హాస్టళ్లలో జరుగుతున్న అరాచకాలివీ. ఒక్క మాటలో చెప్పాలంటే అవి పిల్లలపాలిట జైళ్లలా మారాయి. చదువుల సంగతి సరే.. లక్షలు పోస్తున్నా.. సదుపాయాలున్నాయా అంటే అవీ అంతంత మాత్రమే. వాష్‌రూమ్, టాయిలెట్ల ముందు కూడా లైన్లు కట్టాల్సిన దుస్థితి. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో ఇబ్బందులతో సావాసం.. వారికి తెలిసిందల్లా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చదువే చదువు. ఆట లేదు.. పాట లేదు.. మానసిక ఉల్లాసం అంత కంటే లేదు. చివరకు కంటినిండా నిద్ర కూడా లేదు. 

కార్పొరేట్‌ కాలేజీల్లో ఇలాంటి నిర్బంధ పరిస్థితులు, ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు చిత్తవుతున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. తమ సమస్యలను చెప్పుకునే అవకాశం లేక.. తల్లిదండ్రులతో మాట్లాడే సమయం లేక చివరకు జీవితాలపైనే విరక్తిని పెంచుకుంటున్నారు. ఒకవేళ సమస్యలను తల్లిదండ్రులకు చెబితే రెడ్‌ మార్కు వేస్తామంటూ బెదిరిస్తుండటంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు సకాలంలో కౌన్సెలింగ్‌ ఇచ్చే కౌన్సెలర్లు లేకపోవడంతో ఆత్మహత్యల వైపు మళ్లుతున్నట్లు బోర్డు అధికారులు గుర్తించారు. 

రాష్ట్రంలోని కార్పొరేట్‌ కాలేజీల్లో ఇటీవల ఇంటర్‌ బోర్డు అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయత్రి తదితర విద్యాసంస్థలకు చెందిన 146 కాలేజీలు, హాస్టళ్లలో తనిఖీలు చేశారు. హెదరాబాద్‌ జిల్లాలో 60 హాస్టళ్లు, రంగారెడ్డి జిల్లాలోని 35, మేడ్చల్‌ జిల్లాలో 51 హాస్టళ్లలో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యల నేపథ్యంలో గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల్లో చెప్పాలంటూ ఆ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. కార్పొరేట్‌ కాలేజీలు, హాస్టళ్లలో సమస్యలపై నివేదిక రూపొందించిన ఆర్జేడీలు దాన్ని ఇంటర్‌ బోర్డుకు అందజేశారు.

గంటల తరబడి చదువే..
ఏకధాటిగా పాఠాలు, వారానికి 4 పరీక్షలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనతున్నట్లు అధికారులు గుర్తించారు. హాస్టళ్లు.. కాలేజీల్లో అకడమిక్‌ కేలండర్‌ అమలు చేయడం లేదు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే (మధ్యలో గంట పాటు బ్రేక్‌) పాఠాలు బోధించాల్సి ఉన్నా దాన్ని ఒక్క కాలేజీ అమలు చేయడం లేదు. రెండో శనివారం, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఒక్కో సబ్జెక్టును ఏకధాటిగా మూడు గంటలపాటు బోధిస్తుండటంతో విద్యార్థులు తీవ్రంగా అలసిపోతున్నారు.

తల్లిదండ్రులకు చెప్పుకునే అవకాశం లేక..
విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఒకవేళ ఎవరైనా చెబితే టీసీపై రెడ్‌ మార్కు వేస్తామని బెదిరిస్తున్నారు. నెలకోసారి నిర్వహించాల్సిన పేరెంట్‌–టీచర్‌ సమావేశాలను నిర్వహించడం లేదు. పిల్లలకు వారానికి ఒకసారి 10 నిమిషాలు మాత్రమే తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులు వచ్చినా గంట మాత్రమే మాట్లాడేందుకు వీలు కల్పిస్తున్నారు. అదీ ఎప్పుడో ఒకసారి మాత్రమే. చాలాసార్లు పరీక్షలున్నాయంటూ వెనక్కి పంపేస్తున్నారు. ఇక కాలేజీలు, హాస్టళ్లలో ఎలాంటి ఫిర్యాదుల బాక్సులు లేవు.

నాణ్యతలేని ఆహారం..
హాస్టళ్లలో ఆహారం నాణ్యత సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు జీర్ణ సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. హాస్టల్‌లో భోజనం చేయని విద్యార్థులు క్యాంటీన్‌లో ఏదైనా తినాలనుకుంటే అక్కడ అడ్డగోలు ధరలు పెట్టారు. సాధారణ ధరల కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టి విద్యార్థుల సొమ్మును దండుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ ఉదయం ఐదున్నర గంటలకే పెడుతుండటంతో తినలేకపోతున్నట్లు విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

యావరేజ్‌ విద్యార్థులు గాలికి..
కార్పొరేట్‌ కాలేజీలు, హాస్టళ్లలో ఉండి చదువుకునే లక్షల మంది విద్యార్థుల్లో మెరిటోరియస్‌ విద్యార్థులకే ప్రాధాన్యం ఉంటుంది. సాధారణ విద్యార్థులను లెక్చరర్లు పట్టించుకోరు. వారి అనుమానాలను నివృత్తి చేయడం లేదు. సాధారణ విద్యార్థులను బాగా చదివే విద్యార్థులతో ఉంచరు. వారిని మరో సెక్షన్‌కు మార్చేస్తారు. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. చాలాచోట్ల పేరుకే ఏసీ క్యాంపస్‌లు. ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. చెప్పినా చూస్తాం.. చేస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారు. హాస్టళ్లలో పేపర్లు, టీవీలను చూడనీయడం లేదు. 

మరిన్ని వార్తలు