ప్రాణదాతలుగా బైంసా యువకులు

10 Feb, 2020 11:45 IST|Sakshi

రక్తదానం కోసం బ్లడ్‌డోనర్స్‌ గ్రూప్‌

వాట్సాప్‌ గ్రూపులో స్పందిస్తూ.. 

సాక్షి, భైంసాటౌన్‌(ముథోల్‌): పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆపత్కాలంలో రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమైనా వెంటనే స్పందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఎందరికో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతూ ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ‘బ్లడ్‌ డోనర్స్‌’ పేరటి వాట్సాప్‌ గ్రూపు ప్రారంభించారు. 300 మంది సభ్యులున్న ఈ గ్రూపులో రక్తం కావాలి అనే సందేశమిస్తే చాలు.. క్షణాల్లో స్పందిస్తూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపు సభ్యుల్లో ఎక్కువ మంది నాలుగు, ఐదుసార్లు రక్తదానం చేసినవారే ఉన్నారు.

ఒక్కరితో మొదలై..
భైంసా పట్టణానికి చెందిన దొడ్లోల్ల సురేశ్‌ స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ముథోల్‌ నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల నుంచి గర్భిణులు, క్షతగాత్రులు, ఇతర రోగులు భైంసాలోని ఏరియాస్పత్రికి వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో గర్భిణులు, ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి రక్తం అవసరం ఉండడం, స్థానికంగా బ్లడ్‌ బ్యాంక్‌ లేకపోవడంతో, రక్తదాతల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. దీంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి రక్తం తీసుకురావాల్సి వచ్చేది. ఒకానొక సమయంలో సకాలంలో రక్తం అందక చనిపోయినవారున్నారు.

ఇదంతా సురేశ్‌ను కదిలించింది. ఒకసారి ఒక గర్భిణికి అత్యవసరంగా ‘0’ పాజిటివ్‌ రక్తం అవసరం ఉండడంతో, సురేశ్‌ తానే స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేశాడు. తను ఒక్కడు మాత్రమే కాకుండా తనలాంటి వారితో రక్తదానం కోసం అత్యవసర సమయాల్లో స్పందించేలా వాట్సాప్‌ గ్రూపు తయారు చేశాడు. ఆ గ్రూపునకు తనే అడ్మిన్‌గా ఉండి తనలాంటి రక్తదానం చేసేవారిని అందులో సభ్యులుగా చేర్చాడు. ఫలితంగా ప్రస్తుతం దాదాపు 300ల మంది సభ్యులతో ఆ గ్రూపు కొనసాగుతోంది. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమున్నా.. క్షణాల్లో గ్రూపు సభ్యులు స్పందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.

రక్తకణాలు ఇచ్చా..
నేను భైంసా ఏరియాస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా చేస్తున్నాను.  రెండేళ్ల క్రితం ఒక వ్యక్తి తీవ్రరక్త స్రావంతో ఆస్పత్రికి వచ్చాడు. అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం ఉండడంతో, నేను వెంటనే రక్తదానం చేసేందుకు ముందుకొచ్చాను. స్థానికంగా బ్లడ్‌ బ్యాంక్‌ లేక చాలామంది ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసినా అందులో నిల్వలు ఉండడం లేదు. ఒకసారి నా స్నేహితుడికి ప్లేట్‌లెట్స్‌ పడిపోయినప్పుడు రక్తకణాలు  దానంగా ఇచ్చాను. అది మరిచిపోలేని సందర్భం.         
– సురేశ్, బ్లడ్‌డోనర్స్‌ గ్రూప్‌ అడ్మిన్, భైంసా

ఎంతో ఆనందంగా ఉంటుంది
నాది ‘ఓ’ నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూపు. నేను ఇప్పటి వరకు మూడుసార్లు రక్తదానం చేశాను. ఒక సందర్భంలో గర్భిణికి, మరో సందర్భంలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి.. ఇంకా ఇతర సందర్భంలో రక్తదానం చేశాను. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి సహాయ పడడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది.
– రాజు, భైంసా

గర్భిణికి రక్తం తక్కువగా ఉండటంతో..
నాది ఓ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపు. నేను బ్లడ్‌ డోనర్స్‌ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాను. ఒకసారి భైంసా ఏరియాస్పత్రికి రాత్రి సమయంలో ఓ గర్భిణిని తీసుకొచ్చారు. ఆపరేషన్‌ చేయాలంటే ఓ పాజిటివ్‌ బ్లడ్‌ కావాలని సూచించారు. దీంతో ఎవరో బ్లడ్‌ డోనర్స్‌ వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేశాను.                    – – సూర్యకిరణ్, భైంసా

మూడుసార్లు రక్తదానం చేశా
నాది ఏ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపు. నేను ఇప్పటివరకు మూడుసార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం ద్వారా ఆపద సమయంలో సహాయపడడం ఎంతో ఆనందంగా ఉంటుంది. బ్లడ్‌ డోనర్స్‌ గ్రూపులో రక్తం అవసరం అనగానే వెంటనే ఫోన్‌ చేసి స్పందిస్తాను. రక్తదానం చేయాలని నాతోటి మిత్రులకు కూడా చెబుతాను.                                      – నరేశ్‌ 

మరిన్ని వార్తలు