లిక్కర్‌ మాయ!

11 May, 2020 12:58 IST|Sakshi

వేసవి కావడంతో బీర్లకు పెరిగిన డిమాండ్‌

ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ

దుకాణాల ఎదుట కనిపించని పెరిగిన ధరల పట్టికలు

సాయంత్రం ఆరు దాటితే చాలు రహస్య విక్రయాలు

4 రోజుల్లోనే దుకాణాలకు రూ.42.36కోట్ల మద్యం  

పెరిగిన ధరలతో ఉమ్మడి జిల్లా నుంచి ఏటా సుమారు రూ.200కోట్ల అదనపు ఆదాయం

మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకోవడంతో మద్యంప్రియులు బారులు తీరుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా 16శాతం ధరలు పెంచినా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాల సమయాన్ని కుదించింది. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ఎక్కడా ధరల పట్టిక ఉండటంలేదు. సమయం దాటిన తర్వాత చాలా చోట్ల రహస్యంగా అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ ఏడాది కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 23నుంచి మే 5వరకు మద్యం దుకాణాలు దాదాపు 45 రోజుల పాటు మూతపడి ఉండటంతో డిమాండ్‌ మ రింత పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడా నికి అనుమతి ఇవ్వగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.42.36కోట్ల విలువజేసే మద్యం రెండు డిపోల నుంచి వైన్‌షాపులకు తరలించారు. దీనిని బట్టి చూ స్తే రికార్డు స్థాయిలో లిక్కర్‌ విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తిమ్మాజిపేట డిపో నుంచి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు కలిపి రూ. 22.15కోట్ల లిక్కర్‌ను, రూ.3.26కోట్ల విలువజేసే బీ ర్లను మద్యం దుకాణాలకు తరలించారు. అలాగే వ నపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు కలిపి కొ త్తకోట డిపో నుంచి రూ.16.95కోట్ల విలువజేసే మ ద్యం వ్యాపారులు తమ దుకాణాలకు తీసుకెళ్లారు.

నిబంధనలు హుష్‌కాకి!
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి మద్యం షాపు వద్ద పెరిగిన మద్యం ధరల పట్టిక విధిగా ఉండాలి. ఏ బ్రాండు మద్యం ఎంతకు విక్రయిస్తున్నారో ధరల పట్టికలో సూచించాల్సి ఉన్నా ఈ నిబంధన అనేక చోట్ల అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఒక్కో క్వార్టర్‌ మద్యంపై కనీసం రూ.పది నుంచి రూ.15 వరకు అదనంగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి బీరుపై ఎంఆర్‌పీ కన్నా రూ.పదికి అదనంగా విక్రయిస్తున్నారు. దీంతో ప్రతినెలా మద్యంప్రియుల జేబుకు చిల్లు పడుతోంది. అలాగే ఖరీదైన మద్యం బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ.30 చొప్పన అదనంగా విక్రయిస్తున్నారు. 

బీర్లకు డిమాండ్‌
అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదువుతుండటంతో మద్యంప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా పది రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో బీర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎండలను బట్టి జూన్, జూలైలోనూ ఈ అమ్మకాలు తారస్థాయిలోనే ఉంటాయి.

పెరిగిన అదనపు ఆదాయం  
మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి భారీగా అదనపు ఆదాయం సమకూరునుంది. చీప్‌ లిక్కర్‌పై 11శాతం, బ్రాండెడ్‌ మద్యంపై 16శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు మద్యంప్రియులపై భారం పడింది. ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు 164, బార్లు 30 ఉన్నాయి. కరోనా ప్రభావంతో మూతపడిన మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతినిస్తూనే ధరలను సైతం పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఒక్కో చిన్న బీరుపై రూ.20, పెద్ద బీర్లపై రూ.30 పెంచారు. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.200కోట్ల ఆదాయం పెరగనుంది.

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
దుకాణాదారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని దుకాణాలకు ఎక్సైజ్‌ శాఖ నుంచే ధరల బోర్డులు తయారుచేసి అందజేశాం. నిర్వాహకులు వీటిని ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాల్సిందే. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కడా ఈ దుకాణాలు తెరవడం లేదు. డిపో నుంచి స్టాక్‌ వస్తే తప్ప ఆ సమయంలో తెరుచుకోవు.– అనిత, ఈఎస్, మహబూబ్‌నగర్

మరిన్ని వార్తలు