10 మంది ఆర్టీఏ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

28 May, 2017 01:47 IST|Sakshi
10 మంది ఆర్టీఏ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

► సెకెండ్‌ వెహికల్‌ రిజిస్ట్రేషన్‌లలో అక్రమాలు
► రవాణా ఆదాయానికి భారీ గండి
► గ్రేటర్‌ పరిధిలో అక్రమాలు


సాక్షి, హైదరాబాద్‌: వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడిన 10 మంది ఆర్టీఏ ఉద్యోగులపై ప్రభుత్వం శనివారం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మ ఆదేశాలు వెలువరించారు. సస్పెండైన వారంతా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లా ల్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్న క్లర్క్‌లు, జూనియర్‌ అసిస్టెంట్‌లు, సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఒక అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ఉన్నారు.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, మేడ్చెల్‌లో ఇద్దరు సస్పెండ్‌ అయ్యారు. రెండో వాహనం రిజిస్ట్రేషన్లలో వాహనదారుల నుంచి తీసుకున్న 14 శాతం పన్నును ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకు న్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లు వెత్తాయి. 2014 నుంచి 2015 వరకు జరిగిన ఈ అక్రమాల్లో మొత్తం 36మంది ఉద్యోగులు భాగస్వా ములై ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. వారందరికీ గత సంవత్సరమే చార్జి మెమోలు జారీ చేశారు. వారిలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిని ప్రస్తుతం సస్పెండ్‌ చేశారు.

భారీ ఎత్తున ఆదాయానికి గండి...
సాధారణంగా వాహనాల రిజిస్ట్రేషన్‌లపై రవాణా శాఖ వాటి ఖరీదులో కొంతమొత్తాన్ని జీవితకాల పన్నురూపంలో వసూలు చేస్తుంది. ద్విచక్ర వాహనాలపై 9 శాతం, కార్లపైన 12 శాతం చొప్పున వసూలు చేస్తారు. సదరు వ్యక్తులు తమకు అప్పటికే ఒక వాహనం ఉండి రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తే మాత్రం వాహనం ఖరీదులో 14 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇలా రెండో వాహనం రిజిస్ట్రేషన్‌లపైన వాహనదారులు చెల్లించే పన్ను పెద్ద ఎత్తున దారి మళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొందరు ఉద్యోగులు వాహనదారుల పేరు, ఇంటి నంబర్, చిరునామా వంటి వివరాల్లో స్వల్ప మార్పులు చేసి ప్రభుత్వ ఖజానాకు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు. అప్పటి రవాణా కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా ఈ కుంభకోణాన్ని గుర్తించి పెద్ద ఎత్తున క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులు తప్పిదాలకు పాల్పడినట్లు గుర్తించి మెమోలు జారీ చేశారు. తాజాగా 10 మంది ఉద్యోగులను తీవ్రమైన తప్పులకు పాల్పడినట్లు గుర్తించి సస్పెండ్‌ చేయడం గమనార్హం. పేర్లు ప్రకటించకపోవడంతో ఆ 10 మంది ఎవరన్న దానిపై ఆర్టీఏ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్, అత్తాపూర్, ఉప్పల్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ వంటి అన్ని చోట్ల ఈ పన్ను ఎగవేత ఉదంతాలు చోటుచేసుకున్నాయి.

మరిన్ని వార్తలు